December 4, 2013

బేరం కుదరక పోవడంవల్లే విభజన నాటకాలు ఆడుతున్నారు.

కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు దొంగనాటకాలు ఆడుతున్నాయని, ఈ రెండు పార్టీలు రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బేరం కుదరక పోవడంవల్లే విభజన నాటకాలు ఆడుతున్నాయని ఆయన ఆరోపించారు.

తెలంగాణ జిల్లాల్లో గురువారం కేసీఆర్ పిలుపిచ్చిన బంద్‌కు సహకరించవద్దని మోత్కుపల్లి కోరారు. కేసీఆర్ టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయనని చెప్పడం వల్లే రాయల తెలంగాణ ప్రతిపాదన తెరమీదకు వచ్చిందని, తెలంగాణ బిల్లు రాకుండా కేసీఆరే అడ్డుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాయల తెలంగాణ ప్రతిపాదన ఎందుకు తెచ్చించో ప్రజలు గమనిస్తున్నారని మోత్కుపల్లి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే తన దుకాణం బంద్ చేసుకోవాల్సి వస్తుందని కెసిఆర్ విభజనను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రకటిస్తామని చెప్పిన కేంద్రం ఇప్పుడు రాయల తెలంగాణ ప్రతిపాదన ఎందుకు తీసుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతామని చెప్పిన కెసిఆర్, ఇప్పుడు మాటమార్చి నాటకాలాడుతున్నారని అన్నారు.

డబ్బు సంచులు, ప్యాకేజీలు ఇక రావనే ఉద్దేశంతోనే విభజనను అడ్డుకునేందుకు కెసిఆర్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీతో కెసిఆర్ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం వెయ్యి మంది ఆత్మ బలిదానం చేసుకుంటే.. కెసిఆర్ కోట్ల కోసం ఆశపడుతున్నారని మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.