October 7, 2013

ఇక జాతీయ స్థాయిలో బాబు పోరు!

సీమాంధ్ర ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడం లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీని కేంద్రంగా చేసుకుని దీక్ష చేపడుతున్నారు. ప్రజా ప్రయోజనాలకంటే కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో గెలిచి రాహుల్ ను ప్రధాని చేయాలనే లక్ష్యంతో పని చేస్తోందంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు బాబు. అంతేకాదు స్వయంగా నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను జాతీయ స్థాయిలో నేతల దృష్టికి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను బహిర్గతం చేయడానికి చంద్రబాబు పూనుకున్నట్లు కనిపిస్తోంది. దేశ ప్రయోజనాలు, ఇటు తెలంగాణ అటు సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితులను అవగాహన చేసుకోకుండా, అంచనాకు రాకుండా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై బాబు మండిపడుతున్నారు.అవసరమైతే ఎజెండాలను, జెండాలను పక్కనబెట్టి తిరిగి ఢిల్లీ వీధుల్లో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి అన్నివర్గాలను కలుపుకుపోతూ కాంగ్రెస్ ఒంటెద్దు పోకడకు తగిన గుణపాఠం చెప్పడానికి సమీకరణాలు చేస్తున్నారు.
వాస్తవానికి ఈ నెల 7 నుంచి ప్రకాశం జిల్లాలో ఆత్మగౌరవ యాత్ర బాబు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలమధ్యకు వెళ్లడంకంటే ఢిల్లీ పీఠంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని బాబు భావిస్తున్నారు. సీమాంధ్రలో ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ప్రత్యక్ష ఆందోళనలు చేపడుతున్నారు. సీమాంధ్రలో ఇప్పుడు సమైక్య సెగలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజల్లోకి వెళ్లడంకంటే తన లాంటి నేత ఢిల్లీలో దీక్ష చేస్తే ఈ సమస్య జాతీయ స్థాయి నేతల్లో కదలిక తీసుకువస్తుందని బాబు భావిస్తున్నారు.అంతే కాదు జగన్ హైదరాబాద్ లో తన నివాసం లోటస్ పాండ్ వద్దే దీక్ష చేస్తుండగా బాబు మాత్రం నేరుగా సోనియా గాంధీతోనే ఈ అంశంపై పోరాటం చేయడానికి ఢిల్లీని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.