October 7, 2013

మీ దీక్ష వల్ల కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని భావిస్తున్నారా ?

సీమాంద్ర ప్రజల సమస్యలు, విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ మాత్రమే తాను నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం డిల్లీ లో ఆయన చేపట్టనున్న దీక్ష సందర్భంగా మొదట హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ … కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానం వల్ల ఒక బాధ్యత కలిగిన పార్టీ నాయకుడిగా కలత చెందానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఇష్టానుసారం కాక స్వంత నిర్ణయాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. స్వాతంత్ర్య విలువలు కాపాడటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. సీమాంద్ర లో ప్రజలు స్వచ్చందంగా ఆందోళన చేస్తున్నారని, అక్కడి ప్రజల ఆవేదన యావత్ దేశానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. సమస్య కు పరిష్కారం దొరికే వరకు శక్తి వంచన లేకుండా పోరాడతానని తెలిపారు. మీ దీక్ష వల్ల కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని భావిస్తున్నారా ? అన్న ప్రశ్నకు, బ్రిటీషు వారు దిగిరారు అనుకుంటే బాపూజీ దీక్షలు చేసేవారు కాదని, మానవత్వం, ప్రజాస్వామ్య విలువలు ఉన్న ఏ ప్రభుతవమైనా దిగి వస్తుందని అన్నారు.