October 1, 2013

తెలంగాణకు కెసిఆర్, సీమాంధ్రకు వైయస్ జగన్, దేశానికి ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలు నాయకత్వం వహించరు.


తెలంగాణ రాష్ట్రా ఏర్పాటు కెసిఆర్ కు పిడుగులాంటి వార్త!: రేవంత్

  తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెసు పార్టీ చెప్పడం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు పిడుగులాంటి వార్త అని తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు, అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి సోమవారం ఎద్దేవా చేశారు.

2014 వరకు తెలంగాణ రాకుంటే వచ్చే ఎన్నికలలో ఎక్కువ సీట్లు గెలుచుకుందామని ఆయన కలలు కన్నారని అవి కల్లలు కావడంతో ఆయన రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి చెప్పాల్సింది చెప్పారన్నారు. తెలంగాణకు తమ పార్టీ అనుకూలంగా ఉండటం, తెలంగాణ రావడం కెసిఆర్ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఆదివారం జరిగిన సకల జన భేరీ సభను కెసిఆర్ కబ్జా చేశారని ఎద్దేవా చేశారు. సీమాంధ్రులను రెచ్చగొట్టేలా మాట్లాడావద్దన్నారు. విజయం సాధించిన వారు ఒదిగి ఉండాలని, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడవద్దన్నారు.

కెసిఆర్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ ఇద్దరు దురాశపరులన్నారు. వారిద్దరు ఏైసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వంలో పని చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రకటనతో ఆయన కలలు పేకమేడల్లా కుప్పకూలాయన్నారు. తెలంగాణకు కెసిఆర్, సీమాంధ్రకు వైయస్ జగన్, దేశానికి ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలు నాయకత్వం వహించలేరన్నారు. తెలంగాణపై సిడబ్ల్యూసి ప్రకటన వచ్చి అరవై రోజులైనా బిల్లు ఎందుకు పెట్టలేదని ఆయన కాంగ్రెసును ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. సీమాంధ్ర ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉందన్నారు. వారు ఆందోళనలను నివృత్తి చేయాల్సి ఉందని చెప్పారు. తెలంగాణపై పార్లమెంటులో నిలదీయాల్సిన కెసిఆర్ తన ఫాంహౌస్‌లో పడుకున్నారని నిప్పులు చెరిగారు. కెసిఆర్ తెలంగాణ ఉద్యమ ద్రోహి అని, ఆయనకు తెలంగాణ రావడం ఇష్టం లేదని మరో నేత దేవినేని ఉమామహేశ్వర రావు విజయవాడలో అన్నారు.