September 28, 2013

అసలు ఏం ప్రధాని మీరు ? మీకు ఆ పదవిలో ఉండడానికి అర్హత ఉందా?

దేశంలో జరుగుతున్న ప్రతి దుష్పరిణామానికీ ప్రధాని మన్‌మోహన్, యూపీఏ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధిలే బాధ్యులు అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు, ప్రధానమంత్రి డాక్టర్ మన్‌మోహన్ సింగ్‌కు ఇక ఎంత మాత్రం పదవిలో కొనసాగరాదనితీవ్రంగా విమర్శించారు. ఆయన ఇక పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతే మంచిది అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆర్థిక నేరస్తులను కట్టడి చేయకపోతే దేశం ఎంతో నష్టపోతుందని ఆయన హెచ్చరించారు.
లక్ష కోట్లు తిన్న వ్యక్తికి జైలులో సకల మర్యాదలు చేశారని చంద్రబాబు ఆక్షేపించారు. జగన్‌ను విడిపించడంలో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యర్థులపై సీబీఐని ప్రయోగించి బెదిరిస్తారని, తర్వాత వారి పబ్బం గడుపుకుంటారని ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే అసలు పట్టించుకోవడం లేదని ఆయన ఆక్షేపించారు. ఆఖరికి కాంగ్రెస్ నాయకులే తమ అగ్ర నాయకత్వం జగన్‌తో ఒప్పందం కుదుర్చుకుందని వారే చెబుతున్నారని ఆయన అన్నారు.
నేషనల్ ఇంటెగ్రేషన్ సమావేశంలో నేను రాష్ట్ర సమస్యను ప్రస్తావిస్తే కాంగ్రెస్ గాని, ముఖ్యమంత్రి గాని ఆ రోజున తమను మాట్లాడనివ్వలేదని, ఆరోజున మాట్లాడింది సొంత సమస్య కాదని ఆయన చెప్పారు. ఆ రోజున తాను మాట్లాడింది ముఖ్యమైన విషయం కాదా అని ఆయన ప్రశ్నించారు. అప్పుడు తాను మాట్లాడితే మాట్లాడనివ్వలేదు, ఇప్పుడు ముఖ్యమంత్రి తానే గుర్తించినట్టు మాట్లాడుతూన్నారని ఆయన దుయ్యబట్టారు.
దేశంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థలనూ అన్ని విధాలా నిర్వీర్యం చేస్తున్నారు అని ఆయన విరుచుకుపడ్డారు. దేశంలో పెరిగిపోతున్న అవినీతిపై గొంతెత్తిన ప్రజలను సర్వ శక్తులు ఒడ్డి ఆ ఉద్యమాన్ని నీరుగార్చారంటూ అన్నా హజారే విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నేర చరితుల విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా, దానికి తూట్లు పొడిచేందుకు యత్నిస్తున్నారు. అవినీతిపరులను, నేరచరితులను కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా మునిగిపోయింది. గనులు, మద్యం అన్నీ మాఫియాగా తయారైపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉంటే ఈరోజున సీబీఐని కూడా పాడుచేశారు. సీబీఐని కూడా ప్రక్షాళన చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ఆకస్మికంగా నిద్ర లేచి, అటువంటిది రాహుల్ ఇప్పుడే జ్ఞానోదయం అయినట్టు మాట్లాడడం విచిత్రంగా ఉందని ఆయన అన్నారు. రూపాయి విలువ పడిపోయింది, ధరలు పడిపోయాయి, ఉపాధి అవకాశాలు పడిపోయాయి. ఈ మొత్తానికి ప్రధాని మన్‌మోహన్ సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధిదే బాధ్యత అని ఆయన మండిపడ్డారు. ఆ రోజున సోనియా చెబితే చేశారు, ఇప్పుడు రాహుల్ ఒక మాట మాట్లాడితే ఇండియాకు వచ్చాక మాట్లాడతాను అంటున్నారు. అసలు ఏం ప్రధాని మీరు ? మీకు ఆ పదవిలో ఉండడానికి అర్హత ఉందా అని ఆయన చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
నేర చరిత్ర గలవారిని కాపాడడంకోసం చేసిన ఆర్డినెన్స్‌ను ఇప్పుడు రాహుల్ ఆక్షేపించడాన్ని ఆయన ఆక్షేపించారు. నేర చరితులు ఎవరైనా సరే పోటీ చేయడానికి వీలులేదని మేము స్పష్టం చేశాం. నేను చాలా రోజుల నుంచి ఈ విషయమే చెబుతున్నాను, అయినా
పార్లమెంటులో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అందరూ వ్యతిరేకించిన తర్వాత ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చారని అడుగుతున్నా. రాహుల్ గాంధి ఇన్నాళ్లు ఎందుకు పట్టించుకోలేదు? ఎక్కడ నిద్ర పోతున్నారు? ఈ బిల్లుపై ఇంత చర్చ జరుగుతున్నప్పుడు రాహుల్ ఏం చేస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు వచ్చి బిల్లును చింపేయాలని ఆయన అంటున్నాడేమిటని ఆయన ఆక్షేపించారు. మీ వల్ల దేశం మొత్తం భ్రష్టు పట్టించారు, సర్వనాశనం అయిపోయింది. నేరస్థులు జైలులో ఉంటే వారు కూడా పోటీ చేసి చట్ట సభలలోకి వచ్చేటట్టు మీరు చేస్తున్నారు. ఒకటి రెండు కాదు, 15 లక్షల కోట్ల కుంభకోణం దేశంలో జరిగింది. కోల్ గేట్, 2 జి స్పెక్ట్రమ్, రాష్ట్రంలో వైఎస్సార్ చేసిన కుంభకోణం. వీటన్నిటిపైనా రాహుల్ ఎప్పుడైనా మాట్లాడారాఇన్నాళ్లుగా మాఫియాలు దోచుకుంటుంటే ఈయన ఏం చేస్తున్నాడు? ఇలాగే రాబర్ట్ వాధ్రా చేసిన కుంభకోణాలు... దాదాపు 11 వేల కోట్ల రూపాయల విలువైన కుంభకోణాలు జరిగినట్టు ఆయనమీద ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని ఇన్ని రకాల కుంభకోణాలు చేస్తుంటే రాహుల్ ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు.
నెగటివ్ వోటు పెట్టమని సుప్రీం కోర్టు చెప్పింది. ఇష్టం లేని అభ్యర్థులను ప్రజలు త్రోసిపుచ్చే అవకాశం ఇప్పుడు వచ్చింది. సమాజంలో మాఫియాలు తయారయ్యాయి. ఆర్థిక సంస్కరణలు వచ్చాక పెద్ద ఎత్తున డబ్బు వస్తోంది. దీన్ని అరికట్టాలి. మీరు సుప్రీం కోర్టు తీర్పును గౌరవించి చట్టసభలను బలోపేతం చేయవలసింది పోయి దానికి తూట్ల పొడుస్తున్నారని ఆయన విమర్శించారు.