September 28, 2013

ఆ కుట్రలు మీకు తెలియదా? తెలిసీ చెప్పడం లేదా?




  కేసీఆర్, జగన్ కాం గ్రెస్ అధినేత్రి సోనియా విసిరిన బాణాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆమె నివాసంలో తయారుచేసి పంపిన స్క్రిప్టును వారిక్కడ చదువుతున్నారని దుయ్యబట్టారు. శనివారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... ఇక ముఖ్యమంత్రి కిరణ్ ఎవరు విసిరిన బాణమో చూడాల్సి ఉందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌తో, సీమాంధ్రలో వైసీపీతో లాలూచీపడి నాలుగు సీట్లు గెలుచుకోవాలని, టీడీపీని దెబ్బ తీయాలని కాంగ్రెస్ కక్కుర్తి పడుతోందన్నారు. ఇటీవలి రాష్ట్ర పరిణామాలన్నీ అడుగడుగునా కుట్రలు, మ్యాచ్ ఫిక్సింగులేనని, వీటన్నింటికీ కేంద్ర బిందువు సోనియాగాంధీ యేనని విమర్శించారు. చీకటి ఒప్పందాలు, తెరచాటు కుట్రలతో తమను బలిపశువులు చేశారని ఆ పార్టీ నేతలే వాపోతున్నారని చెప్పారు. 'సొంత పార్టీ పోయినా నాలుగు సీట్లు వచ్చి మళ్లీ అధికారం దక్కితే చాలని భావించే మహా నాయకురాలిని ఇప్పుడే చూస్తున్నాం' అని ధ్వజమెత్తారు.

తమ పార్టీ ఇటువంటి కుట్రలను చేధించేందుకు ఎన్టీఆర్ విసిరిన రామబాణమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనపై తమ వైఖరి స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. 'రెండు ప్రాంతాల నాయకులతో ఢిల్లీవెళ్లి మూడు రోజులు అందరితో మాట్లాడాను. వారిని మేనేజ్ చేయడం కాకుండా ఇరుపక్కలా ఉన్న జేఏసీలు, విద్యార్థులు, ప్రభావిత వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడి, సమస్యలేమిటో తెలుసుకొని పరిష్కరించమని చెప్పా. ఇదే మా వైఖరి. ఇది సున్నితమైన సమస్య అనే సంగతి మరచి, రాజకీయ లబ్ధికోసం జటిలం చేయడం వల్లే రాష్ట్రం తగలబడుతోంది' అని వ్యాఖ్యానించా రు. సమస్యల గురించి ఇప్పుడు మాట్లాడుతు న్న సీఎం, ముందుగా తమ అధిష్ఠానంవద్ద ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. '60 రోజుల తర్వాత లేచి వచ్చి మాట్లాడుతున్నారు.

ఇన్ని రోజులూ ఏం చేశారు? ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడేందుకు కనీసం పార్టీ నాయకత్వాన్ని ఒప్పించలేకపోయారే? పార్టీలో మీ పలుకుబడి ఇదేనా? సీఎంగా చేయాల్సిన సమయంలో చేయకుండా ఇప్పుడు మాట్లాడితే ఉపయోగం ఏమిటి? సీడబ్ల్యూసీ తీర్మానానికి ముందు సీఎం, డిప్యూటీ సీఎం, పిీసీసీ అధ్యక్షులను నాలుగైదుసార్లు పిలిపించి మాట్లాడారు. అప్పుడే ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? చెప్పినా వినకపోతే అప్పుడే బయటకొచ్చి చెప్పాల్సింది. ఆ రోజు సహకరిస్తామని చెప్పి, ఇప్పుడు ఇక్కడ సమైక్యాంధ్ర అంటూ మాట్లాడుతున్నారు. ఇతర పార్టీలతో మ్యాచ్ ఫిక్సింగులు చేసుకొని పార్టీ అధిష్ఠానమే కుట్రలకు పాల్పడుతోందని స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఆ కుట్రలు మీకు తెలియదా? తెలిసీ చెప్పడం లేదా? ఢిల్లీలో జరిగిన జాతీయ సమగ్రత మండలి సమావేశంలో నేను రాష్ట్రంలో పరిస్థితులు వివరిస్తుంటే మైక్ కట్ చేశారు.

నిరసనగా వాకౌట్ చేశాను. అదే వేదికపై ఉన్న ముఖ్యమంత్రి కనీసం నోరు తెరిచారా? రాష్ట్రంలో అంతా బాగుందని చెప్పి వచ్చారు. ఢిల్లీలో సోనియా ముందు మాట్లాడటానికి భయం. ఇక్కడికి వచ్చి లీకులు. నేను సీనియర్ రాజకీయవేత్తగా చేయాల్సింది చిత్తశుద్ధితో చేస్తున్నాను. జాక్‌పాట్‌తో సీఎం పోస్టులోకి వచ్చిన వారు కూడా నా గురించి మాట్లాడితే ఎలా? మేం ఏనాడూ అధికారం కోసం లేం. మేం ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం సిన్సియర్‌గా చేశాం. ప్రజల్లో మా పట్ల ఉన్న మంచిని పోగొట్టడానికే కాంగ్రెస్, టీఆర్ఎస్, వైసీపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి' అని విమర్శించారు. కిరణ్ తానే మాట్లాడుతున్నారా లేక ఢిల్లీ పెద్దలు మాట్లాడిస్తున్నారా అన్నది తనకు తెలియదని ఈ సమయంలో ఏదైనా జరగవచ్చని ఒక ప్రశ్నకు జవాబిచ్చారు.

అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎంత చిచ్చుకైనా, ఎవరితో చేతులు కలపడానికైనా వెనకాడటం లేదని, ఆ పార్టీని ఇంటికి పంపితేనే దేశం బాగుపడుతుందన్నారు. ఇందుకోసం తాను జాతీయ స్థాయిలో ఎవరెవరిని కలుపుకుంటానో ఇప్పుడే చెప్పలేన న్నారు. బీజేపీతో పొత్తుపై సమాధానం దాటవేశారు. దేశం ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకొందని, దానికి కారణమైన కాంగ్రెస్ ఓటమికోసం అన్ని పార్టీలతో మాట్లాడతానని చెప్పారు. అక్టోబర్ 4 నుంచి మళ్లీ జిల్లాల పర్యటనకు వెళ్తున్నానని బాబు తెలిపారు.

'సీమాంధ్రలో కాంగ్రెస్ ప్రజాగ్రహంలో కొట్టుకుపోయింది. ఆ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్‌ద్వారా బెయిలుపై వచ్చిన జగన్ కూడా విలువ కోల్పోయాడు. ప్రజల విశ్వాసం మనవైపే ఉంది. మీరు ప్రజల్లో ఉండి, బాగా పనిచేయండి. వారి నమ్మకాన్ని నిల బెట్టుకుందాం' అని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. శనివారం ఆయన తన నివాసంలో ఉభయ గోదావరి జిల్లాల పార్టీ నేతలతో మాట్లాడారు.