September 15, 2013

కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య సెటిల్‌మెంట్ కాకపోవడం వల్లనే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టడం లేదు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన లేఖను వాపస్ తీసుకునేది లేదని, కొన్ని పార్టీలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, పార్లమెంట్‌లో బిల్లు పెట్టే వరకు పోరాటం చేస్తామని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖకు పార్టీ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగమని పది జిల్లాలతో కూడిన తెలంగాణను టీడీపీ కోరుకుంటుందన్నారు.


ఈ నెల 16న తెలంగాణ ప్రాంత పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారని తెలిపారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలనే డిమాండ్‌తో కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణ చేపడతామని అన్నారు. 4, 5 జిల్లాల్లో బహిరంగసభలు పెట్టే విషయమై ఆలోచిస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీపై కాంగ్రెస్, వైఎస్ఆర్‌సీపీ, టీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టనున్నామన్నారు.

తెలంగాణ ప్రాంతంలో చంద్రబాబు పర్యటిస్తారని చెప్పారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య సెటిల్‌మెంట్ కాకపోవడం వల్లనే పార్లమెంట్‌లో
తెలంగాణ బిల్లు పెట్టడం లేదనే అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు. ప్యాకేజా, మరేదైనా ఉందా అనే విషయం స్పష్టం కావడం లేదన్నారు. ఈ కారణంగానే కేబినెట్ నోట్‌కు కూడా వాయిదా వేసి ఉంటారని అన్నారు.