July 22, 2013

చంద్రబాబు కోరితే అవనిగడ్డ లో పోటీచేయం

కృష్ణా జిల్లా అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేయవద్దని ఇతర పార్టీలను టిడిపి అద్యక్షుడు చంద్రబాబు నాయుడు కోరితే ఆ విషయంపై ఆలోచన చేయాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.టిడిపి ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మరణం కారణంగా అక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది.ఈ ఆరు నెలలకాలం కోసం ఎన్నికలలో పోటీచేసి వ్యయప్రయాసలెందుకని ఆయా పార్టీలు భావిస్తున్నాయి.సిటింగ్ ఎమ్మెల్యే టిడిపికి చెందిన వ్యక్తి కనుక ఆయన కుమారుడు హరిబాబు రంగంలో ఉంటున్నందున ఆయనపై పోటీపెట్టకుండా ఉంటేనే బెటర్ అని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఆలోచనగా చెబుతున్నారు.

కాంగ్రెస్ కూడా అందుకు సిద్దపడవచ్చు.కాంగ్రెస్ అభ్యర్ధి మండలి బుద్ద ప్రసాద్ ప్రస్తుతం క్యాబినెట్ హోదా కలిగిన తెలుగు భాషా సంఘం అద్యక్షుడుగా ఉన్నారు.ఆయన రంగంలో దిగవలసి వస్తే ఆ పదవిని వదలుకోవలసి వస్తుంది.ఇదంతా పెద్ద ప్రయాస అవుతుంది.అయితే టిడిపి అదినేత చంద్రబాబు కోరితే ఈ విషయంపై ఆలోచించాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ భావిస్తోంది.చంద్రబాబు నేరుగా కోరతారా?లేక బ్రాహ్మణయ్య కుటుంబ సభ్యులు కోరతారా అన్నది చూడాలి.