June 30, 2013

బెజవాడ'పై రాజీ: తూర్పుకు గద్దె, ఎంపీ టిక్కెట్‌కు నాని



విజయవాడ: కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో విజయవాడ లోకసభ స్థానం రగడ కొలిక్కి వచ్చినట్లుగా కనిపిస్తోంది. 2014 ఎన్నికలలో విజయవాడ పార్లమెంటు టిక్కెట్‌ను టిడిపి తరఫున గద్దె రామ్మోహన్ రావు, కేశినేని నానిలు ఆశించిన విషయం తెలిసిందే. అప్పటికే కేశినేనిని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇంఛార్జిగా ప్రకటించారు. ఇంఛార్జి ప్రకటన తర్వాత కూడా గద్దె అధినేతను కలిసి విజయవాడ టిక్కెట్‌‍ను కోరారు.

ఈ రగడ ఇటీవల బెజవాడలో చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు ఇద్దరు నేతలు రాజీకి వచ్చినట్లుగా కనిపిస్తోంది. దీంతో విజయవాడ పార్లమెంటు టిక్కెట్ కేశినేని నానికి, విజయవాడ తూర్పు టిక్కెట్ గద్దె రామ్మోహన రావుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే ఉద్దేశ్యంలో భాగంగా ఇరువురు నేతలు రాజీకి వచ్చినట్లుగా కనిపిస్తోంది.

ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ తామిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, పార్టీ అధినేత ఏది చెబితే అది చేయడమే తమ విధి అన్నారు. టిడిపి క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, దానికి అనుగుణంగానే తాము నడుచుకుంటున్నామని కేశినేని నాని చెప్పారు.

గద్దె రామ్మోహన రావు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రం చాలా సమస్యల్లో ఉందని, వాటిని తీర్చడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఆయన ఆదేశాలను తాము పాటిస్తామని చెప్పారు. విజయవాడ ఇంఛార్జిగా నానిని నియమించానని, తూర్పు నియోజకవర్గం చూసుకోవాలని తనకు అధినేత సూచించారన్నారు.