May 23, 2013

టీఆర్‌ఎస్‌ వసూళ్ల పార్టీ జగన్‌ది జైలు పార్టీ


హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) వసూళ్ల పార్టీ అని, వైస్సార్సీపీ జైలు పార్టీ అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అపహాస్యం చేశారు. ఒకరికీ ఎలక్షన్లు, కలెక్షన్లు లక్ష్యమైతే, మరొకరు బెయిల్‌ కోసం ఏ గడ్డి కరువడానికైన సిద్ధమేనంటూ శివాలెత్తారు. టీడీపీ హయాంలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందని తాము విసిరిన సవాల్‌ను ఎవరు స్వీకరించి ముందుకురాలేదని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ అంశాన్ని తేల్చేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తొలుత డిమాండ్‌ చేసిందే తెలుగుదేశం పార్టీయేనంటూ చంద్రబాబు గుర్తు చేశారు. గురువారం చంద్రబాబు సమక్షంలో ఆయన నివాసంలో ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూర్‌కు చెందిన బీజేపీ నాయకుడు మురళితో పాటు వందలాది మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణపై 2008లో ఇచ్చిన లేఖకే కట్టుబడి ఉన్నామని అఖిలపక్ష సమావేశంలో విస్పష్టంగా చేశామన్నారు. అయినా టీఆర్‌ఎస్‌ దురుద్దేశ్యంతో టీడీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ దుష్పప్రచారాన్ని పార్టీ శ్రేణులు సమర్ధవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ అవినీతి, అసమర్ధ పార్టీ అని దుమ్మెత్తిపోశారు. ప్రజాసంపదను, ప్రకృతి వనరులను ఇష్టారీతిలో కాంగ్రెస్‌ నేతలు దోచుకుతింటున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తే, కాంగ్రెస్‌ ప్రభుత్వం అదోగతిపాలు చేసిందని విరుచుపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాల్సిన సమయంలో అవినీతి, అసమర్ధ పాలన వల్ల భ్రష్టు పట్టిపోయిందన్నారు.

కిరణ్‌ సర్కార్‌ ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకంపై ఆయన వ్యంగ్యస్త్రాలు సంధించారు. అది అమ్మహస్తం కాదని మొండిహస్తమంటూ అపహాస్యం చేశారు. పశువులు తినే నాసిరకం వస్తువులను పేదలకు సరఫరా చేస్తున్నారని శివాలెత్తారు. తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వారికి సాధరంగా స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. 2014 ఎన్నికల్లో టీడీపీని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. టీడీపీని ప్రజలు ఆదరిస్తున్నారని, కార్యకర్తలు మరింతగా ప్రజలకు చేరువ కావాలని సూచించారు.