May 23, 2013

దేశం గెలుపు చారిత్రక అవసరం

హైదరాబాద్‌ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం చారిత్రక అవసరమని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం అభిర్ణించారు. రానున్న స్థానిక సంస్థల, సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూరు కాగజ్‌నగర్‌ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత గణపరం మురళి తన అనుచరులతో కలిసి చంద్రబాబు నివాసంలో తెదేపాలో చేరారు. ఆ సందర్భంగా ఇంటి ఆవరణలో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఇతర పార్టీలు చేస్తోన్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరారు. ''పార్టీని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. అన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది'' అని శ్రేణులకు హామీనిచ్చారు.

తెలంగాణపై స్పష్టమే

తెలంగాణపై తెలుగుదేశం వైఖరి స్పష్టంగా ఉందని బాబు చెప్పారు. గడచిన 2008లో ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి రాసిన లేఖకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామన్నారు. తమ పార్టీ హయాంలోనే తెలంగాణ ప్రాంతం, ఆదిలాబాద్‌ జిల్లా సర్వతో ముఖాభివృద్ధి సాధించాయని తెలిపారు.

తెలంగాణలో తమ హయాంలో 18లక్షల ఎకరాలకు సాగునీరును అందించామన్నారు. ఆదిలాబాద్‌లో 100 కోట్లతో ప్రారం భించిన 'వెలుగు' ప్రాజెక్టును రెండు వేల కోట్లతో రాష్ట్రమంతా విస్తరించిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ను అవినీతి పార్టీగా, టీఆర్‌ఎస్‌ను వసూళ్ల పార్టీగా, వైఎస్సార్‌సీపీని జైలు పార్టీగా అభివర్ణించిన చంద్ర బాబు వచ్చే ఎన్నికల్లో వాటి చిరునామా గల్లంతు చేసి 'దేశం' పతాకను రెపరెపలాడించాలని పిలుపునిచ్చారు.

పత్తి ధర పెంచలేదేం?

''ఆదిలాబాద్‌ అంటే పత్తి సాగు గుర్తుకు వస్తుంది. క్రిమి సంహారక మందులు, ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి పత్తికి కనీస మద్దతు ధర పెంచారా? పులిలో పుట్రలా 20వేల కోట్ల విద్యుత్‌ భారాన్ని ప్రజలపై మోపారు. రోజుకు మూడు గంటలకు మించి విద్యుత్‌ సరఫరా చేయరు. రైతాంగం పరిస్థితి ఏమిటి? అందుకే- సుస్థిర, నీతివంత పాలన కోసం తెలుగుదేశం గెలవాలి. అది చారిత్రక అవసరం'' అని చంద్రబాబు ఉద్భోధించారు.

విధానాలు నచ్చి: మురళి

ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు రమేశ్‌ రాథోడ్‌ ఆధ్వర్యంలో బోధ్‌ ఎమ్మెల్యే నగేష్‌ సమక్షంలో మురళి తెదేపా సభ్యత్వం స్వీకరించారు. ఆయన గతంలో పీఆర్పీలో చురుకైన పాత్ర పోషించారు. అయితే 2009లో ఆయనకు టికెట్‌ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరి సిర్పూరు నుంచి పోటీ చేశారు. తెలుగుదేశం బలాలైన సమర్థ నాయకత్వం, అవినీతి రహిత విధానం, అభివృద్ధి పట్ల ఆ పార్టీ దృక్పథం నచ్చి చేరుతున్నట్లు మురళి చెప్పారు. ఆయనతో పాటు వివిధ పార్టీలకు చెందిన స్థానిక నేతలు టీడీపీలో చేరారు.

వేతనాలు- గుర్తింపు కార్డులివ్వాలి

ఏళ్ల తరబడి పని చేస్తోన్న 'యానిమేటర్ల'కు కనీస వేతనాలు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు. పదేళ్లుగా ఇందిర క్రాంతి పథంలో పని చేస్తున్న యానిమేటర్లను మాయ మాటలతో ప్రభుత్వం వంచి స్తోందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో పని చేస్తున్న 40వేల మంది యానిమేటర్ల న్యాయమైన కోర్కెలను తీర్చాలని ప్రభుత్వాన్ని చంద్ర బాబు డిమాండ్‌ చేశారు.