December 20, 2012

నిధులూ లేవు.. విధులూ లేవు!

గ్రామ గ్రామానా అందమైన గ్రామ సచివాలయాలు వెలిసిన రోజులవి! అప్పట్లో సమస్యల పరిష్కారానికి అవే వేదికలు! మూడు నెలలకోసారి జన్మభూమి పేరిట సభలు అక్కడే జరిగేవి! రైతు మిత్ర, డ్వాక్రా సంఘాలు, విద్యా కమిటీలు, సాగునీటి సంఘాలు అన్నిటికీ అవే వేదికలు! చివరికి, ఫలితాలూ ఆశాజనకంగానే వచ్చాయి! రోగాలకు దూరంగా గ్రామాలు పరిశుభ్రంగా ఉండేవి! బ్లీచింగ్ కలిపిన 'మంచి' నీళ్లు ప్రజలకు అందేవి! మరి ఇప్పుడో!? గ్రామీణ ప్రాంతాలన్నీ కళా విహీనం! గ్రామ సచివాలయాలు జన విహీనం! ఎప్పుడు చూసినా గ్రామ సచివాలయాలకు తాళాలే! గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేది సచివాలయ సిబ్బందే! వీధిలైట్లు వేసేదీ వారే. మంచినీళ్లు సరఫరా చేసేదీ వారే! మురుగు కాల్వలు, రోడ్లు శుభ్రం చేసేదీ వారే! గ్రామాన్ని అద్దంలా తీర్చిదిద్దే బాధ్యత వారిదే. కానీ, వారి సమస్యల పరిష్కారం విషయంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

టీడీపీ హయాంలో ఇటు నిధులు.. అటు విధులు అప్పగించి అభివృద్ధికి బాటలు పరిస్తే.. నిధులను.. వాటితోపాటు విధులను తీసేసి గ్రామ సచివాలయాలను, వాటిలోని సిబ్బందిని నామమాత్రం చేసిందీ సర్కారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన స్థానిక సంస్థలను పతనావస్థకు తీసుకెళ్లింది. అందుకే, లింగంపల్లిలో గ్రామ పంచాయతీ వర్కర్లు నా పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రం సమర్పించారు. వారిలో నెలకు రూ.300 జీతగాళ్లు కూడా ఉన్నారు. ఈ రోజుల్లో నెలకు రూ.300 జీతం ఏపాటి!?

తాను తీసుకొచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణలకు కాంగ్రెస్ ప్రభుత్వమే గండి కొట్టింది. పంచాయతీలను నిర్లక్ష్యం చేయడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన రూ.3000 కోట్లకు గండి పడింది. గ్రామాల్లోని ప్రజల ఆరోగ్యానికీ పూచీ లేదు. గ్రామాన్ని శుభ్రం చేసే సిబ్బంది ఆరోగ్యానికీ భరోసా లేదు. వారి డిమాండ్లలో కొన్నిటిలో నిజాయతీ ఉంది. వాటి పరిష్కారకానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా!