November 29, 2012

యాత్ర ఆగదు అవసరమైతే.. జనవరి 26 తరువాతా నడుస్తా

హైదరాబాద్, నవంబర్ 29 : ఆరోగ్య సమస్యలెలా ఉన్నా పాదయాత్ర ఆపే ప్రసక్తి లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. బాబు ఆరోగ్యంపై 'ఆంధ్రజ్యోతి'లో ప్రచురితమైన వార్త పార్టీ వర్గాల్లో కలకలం కలిగించింది. గురువారం కొందరు నేతలు ఆయన వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. పాదయాత్రకు విరామం ఇవ్వాలన్నారు. కానీ వారి సూచనను ఆయన కొట్టిపారేశారు. 'ఆరు నూరైనా పాదయాత్ర ఆపేది లేదు. ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకొన్న తర్వాత వెనకడుగు ఉండకూడదు. బయట తిరిగేటప్పుడు ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. తట్టుకోవాలి. పాదయాత్రను జనవరి 26తో ముగించాలనుకొన్నాం.

కానీ అప్పటికి అనుకున్న చోటుకు (ఇచ్ఛాపురం) చేరడం సాధ్యమయ్యేలా లేదు. అవసరాన్ని బట్టి ఆ తర్వాత కూడా పాదయాత్ర కొనసాగుతుంది. దానికి సిద్ధంగా ఉన్నాను' అని ఆయన వారితో చెప్పారు. ఇప్పుడు చేస్తోంది మొదటి విడత పాదయాత్ర మాత్రమేనని, దీని కొనసాగింపూ ఉండవచ్చని సూచనప్రాయంగా చెప్పారు. మరోపక్క వైద్యులు ఆయన ఆరోగ్య స్ధితిని పరిశీలిస్తున్నారు. గురువారం షుగర్ సాధారణ స్థితికి వచ్చినట్లు తెలిసింది. కాళ్లనొప్పులు తగ్గినా కాలి చిటికిన వేలు సమస్య మాత్రం చంద్రబాబును బాధిస్తూనే ఉంది. ప్రత్యేకసాక్సు వేసుకోవాలని వైద్యులు సూచించారు