November 29, 2012

అడవుల్లో ఆణిముత్యాలు:చంద్రబాబు

శ్రమ + ప్రతిభ = విజయం! కానీ, కష్టపడే ప్రతిభావంతులందరూ విజయం సాధించ లేకపోతున్నారు! ఇందుకు కారణం.. వారికి అవకాశాలు కల్పించకపోవడమే! సరైన దారిలో వారిని నడిపించకపోవడమే! కాయ తొడిమను గురి చూసి కొట్టగల విలుకాళ్లు మన తండాల్లో ఎందరో!? సరైన శిక్షణ ఇస్తే వారంతా ఒలింపిక్స్ హీరోలే! కానీ, ఆ చొరవ ఏదీ!? ఈ రోజంతా నా పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలోని లంబాడా తండాల్లోనే సాగింది. వారంతా కష్టజీవులు! నిజాయతీపరులు! వారిలో చాలామందికి సెంటు భూమి కూడా లేదు! సొంత ఇల్లు లేదు! ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు! ప్రతి తండాలోనూ సంప్రదాయ ఆలయాలున్నాయి. భక్తి కూడా ఎక్కువే. నన్ను తీసుకెళ్లి పూజలు జరిపించారు కూడా!

తండాలోనే లక్కీబాయి అనే 65 ఏళ్ల మహిళను పలకరించాను. సొంతంగా పశువులు లేకపోవడంతో ఆమె వేరేవాళ్ల పశువులను కాస్తోంది. వృద్ధాశ్రమంలో చేర్పిస్తా. చక్కగా అక్కడికి వెళ్లి ఉంటావా!? అని అడిగితే ఆమె ససేమిరా వెళ్లనని చెప్పింది. నేను 'ఎందుకు?' అని అడిగినప్పుడు ఆమె ఇచ్చిన జవాబు నన్ను ముగ్ధుడిని చేసింది. "ఊరికే తిని కూర్చుంటే అందరూ ఎగతాళి చేస్తారు. అందుకే కష్టపడి పని చేసుకుంటాను'' అని ఆమె జవాబు ఇచ్చింది. గిరిజనులు ఎంత కష్టజీవులో చెప్పేందుకు ఇదే నిదర్శనం. కేవలం వారు కష్టజీవులు మాత్రమే కాదు. గిరిజనుల్లో ప్రతిభావంతులు కూడా ఉన్నారు. అవకాశాలు కల్పిస్తే అద్భుతంగా రాణిస్తారు కూడా!

అందుకే గిరిజనులకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. వారి అభివృద్ధికి, సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రకటించాం. గిరిజన విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందిస్తామని స్పష్టం చేశాం. కొంత చేయూత అందిస్తే వారు త్వరగా పైకి వస్తారు. మా ఎస్టీ డిక్లరేషన్ వారికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా!!