November 25, 2012

ఆదుకోండి బాబూ..!

  ఆదుకోండి బాబూ..!

మనది ప్రజాస్వామ్యం! ఇక్కడ ప్రజలదే అధికారం! కానీ, ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి!? కనీసం ఒక్కరంటే ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా!? అధికారం కాదు కదా.. కనీసం ప్రశాంతంగా, కనీసం ఒక్క పూటయినా కడుపు నిండా తినే పరిస్థితి ఉందా!? ప్రజలతో ఎన్నికైన ఈ ప్రభుత్వం ఎంత అన్యాయంగా వ్యవహరిస్తోంది!! ఈరోజు ఉదయం గిరిజన తండాల్లో పర్యటించా. వాస్తవ పరిస్థితి చూసి కళ్లు బైర్లు కమ్మాయి. తండాల్లోని వారంతా పేద లంబాడాలు. కొండ కోనల్లో కష్టపడి నాలుగు రాళ్లు వెనకేసుకున్నారు. సొంత డబ్బులతో ఇళ్లు కట్టుకున్నారు. కానీ, ఇందిరమ్మ పథకం కింద కట్టామని చెప్పుకొని వాటికి కూడా బిల్లులు చేసుకుని కాంగ్రెస్ నాయకులు మింగేశారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా?

జగన్నాథ్‌పూర్‌లో అమాయక రైతులు. వారికి చదువు రాదు. వారి పొలాలను కొంతమంది స్థానిక కాంగ్రెస్ నాయకులు కౌలుకు తీసుకున్నారు. వాటిలో గంజాయి పండిస్తున్నారు. పంట సొమ్మును వారు జేబుల్లో వేసుకుంటున్నారు. పోలీసులు వచ్చి కేసులు పెడితే అసలు రైతును బుక్ చేయిస్తున్నారు. ఏ పాపం చేయకుండానే రైతులు జైలుకు వెళ్లాల్సి వస్తోంది.

ఉపాధి హామీ పథకంలోనూ కూలీల పేరిట డబ్బులను మింగేస్తున్నారు. దారిలో కలుపు తీసుకుంటున్న ఉల్లి రైతును చూశాను. కన్నీళ్లు ఒక్కటే తక్కువ. బొల్లారం నుంచి కొంతమంది కార్మిక సోదరులు వచ్చి సంఘీభావం తెలిపారు. విద్యుత్తు కోతలతో తాము రోడ్డున పడ్డామని కన్నీరు మున్నీరయ్యారు. ప్రతి ఒక్కరూ గుండెల నిండా ఆవేదనతో చెప్పేది ఒకటే మాట.. ఆదుకోండి అని!!