October 14, 2012

ప్రజల సొమ్ము దోచేస్తున్నారు..!-ప్రజాశక్తి-


ప్రజాశక్తి-గుంతకల్లు టౌన్‌   Sun, 14 Oct 2012, IST  
  • కాంగ్రెస్‌, వైఎస్సార్సీపివి నీతిమాలిన రాజకీయాలు
  • పాదయాత్రలో చంద్రబాబు నాయుడు
కేంద్ర, రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ పాలనలో ఆ పార్టీ నాయకులు ప్రజల సొమ్మును అప్పనంగా దోచేస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లా చిన్నహోతూరు బహిరంగసభలో బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకొచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని విమర్శించారు. రాజీవ్‌యువకిరణాలని గొప్పలు చెప్పిన కిరణ్‌ సర్కారు ఆచరణలో నీరుగార్చిందన్నారు. వజ్రకరూరు మండలం చిన్నహోతూరు గ్రామం నుంచి శనివారం యాత్ర ప్రారంభించి, ఉదయం 11 గంటలకు వజ్రకరూరు రచ్చబండ వద్ద బాబు ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. మధ్యాహ్నం పెద్దహోతూరు, చిన్నహోతూరు, గడేహోతూరు గ్రామాల్లో పాదయాత్ర చేశారు. పొట్టిపాడు పొలాల్లో వేరుశనగ పంటను పరిశీలించి సాయంత్రం కొనకొండ్ల గ్రామానికి చేరుకున్నారు. 'వస్తున్నా..మీకోసం' యాత్ర 12వ రోజు 22 కిలోమీటర్లు సాగింది. ఫీజురీయింబర్స్‌మెంట్‌ అందక అనేక మంది పేద విద్యార్థులు చదవులను మధ్యలోనే ఆపేస్తున్నారని చెప్పారు. పావలా వడ్డీతో మహిళలను లక్షాధికారులను చేస్తామన్న కాంగ్రెస్‌ డ్వాక్రా మహిళలను అప్పుల పాలుజేసిందన్నారు. గ్యాస్‌పై నిబంధనలను పెట్టడం దారుణమన్నారు. ఎరువుల ధరలు పెరగడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారన్నారు. అంత్యోదయ, పింఛన్లు, ఉపాధిహామీ, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాల్లో లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. వైఎస్‌ఆర్‌ పరిపాలనలో 43 వేల కోట్ల రూపాయల అవినీతికి ఆయన కుటుంబ సభ్యులు పాల్పడ్డారన్నారు. ప్రజా సమస్యలపై తాను పాదయాత్ర చేపడితే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టమని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు డిమాండ్‌ చేయడం హాస్యాస్పదమన్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే సంతలో గొర్రెల్లా ఎంపీ, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఆ పార్టీ కుట్ర చేస్తోందన్నారు. తాము అధికారంలోకొస్తే వృద్ధులు, వింతువులకు రూ.600 పింఛను, నిరుద్యోగులకు వెయ్యి రూపాయల భృతి కల్పిస్తామన్నారు. జిల్లాలో చికున్‌గున్యా, డెంగ్యూ విషజ్వరాలు అధికమ య్యాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత, అబ్ధుల్‌ఘనీ, పయ్యావుల కేశవ్‌, పార్థసారధి, పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు, నియోజకవర్గం ఇన్‌ఛార్జిలు శమంతకమణి, వరదాపురం సూరి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శోభాహైమావతి పాల్గొన్నారు.
No comments :

No comments :