June 6, 2013

ఎన్నికలకు సిద్ధంకండి!



   తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో గురువారం నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ప్రతినిధులతో అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జిలు, పార్లమెంటు కోఆర్డినేటర్‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు దశ, దిశ నిర్దేశించారు. గ్రామాలవారీగా బలాబలాలు విశ్లేషించుకుని, కార్యకర్తల ప్రోత్సాహంతో ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టి తెలుగుదేశం ప్రభుత్వం అమలుచేసిన కార్యక్రమాలు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అక్రమాల గురించి ప్రజలకు వివరించవలసిందిగా ఆదేశించారు. వివిధ కారణాల వల్ల దూరమైన నాయకులను, ఓటర్లను కలుసుకుని తెలుగుదేశం వైపు వారిని ఆకర్షించే ప్రయత్నం చేయాలని సూచించారు. కోస్తా జిల్లాలలో చేపల చెరువులకు అనుమతులు సకాలంలో లభించడం లేదని, చెరువులను రెగ్యులరైజ్‌ చేయడానికి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, దీనిని వెంటనే ఆపించవలసిందిగా కొంతమంది ప్రతినిధులు కోరారు. ఎస్టీలకు జనాభా ప్రాతిపతికన రాజకీయాల్లోనూ, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించవలసిందిగా కొందరు కోరారు. ఎస్సీ, ఎస్టీలకు జిల్లావారిగా జనాభా దామాషాకు అనుగుణంగా రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించినట్లయితే సమస్య పరిష్కారమవుతుందని భావించినట్లు ఆ పార్టీ మీడియా కమిటీ చైర్మన్‌ ఎల్వీఎస్‌ఆర్కె ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు.