January 22, 2013

అదే ఊపు.. అదే ఉత్సాహం

నల్లగొండ జిల్లాలో పాదయాత్ర ముగించుకొని కృష్ణాజిల్లాలో ప్రవేశించిన నాకు అదే ఆ దరణ..అదే అభిమానం. ఇసుక వేస్తే రాలనంతగా పోటెత్తిన జనాభిమానం ఉక్కిరిబిక్కిరి చేసింది. గరికపాడు వద్ద జిల్లా ప్రజలు చూపిన ఆదరణ అపూర్వం. జాతీయ రహదారి మొత్తం నన్ను చూసేందుకు తరలివచ్చే జనసందోహంతో నిండిపోయింది. యాత్ర సాగుతున్నంతసేపు నాలోనూ వాళ్లలోనూ ఒకే ఊపు, ఒకే ఉత్సాహం పరవళ్లు తొక్కింది. ఈ రోజంతా పశ్చిమ కృష్ణాలోనే నడిచాను. ఈ ప్రాంతం నాగార్జునసాగర్ ఎడమ కాలువ జోన్ 3 పరిధిలోకి వస్తుంది. కానీ, సాగునీరే రావడం లేదు. కృష్ణానది పక్కనే ఉన్నా కనీసం ఎత్తిపోతల ద్వారా అయినా పంటకు నీరందే పరిస్థితి లేదు.

ఉన్న ఒకటో రెండో పథకాలూ ఎత్తిపోయాయి. ఇక వరుణదేవుడే దిక్కు. ఆ దేవుడు కరుణిస్తే రైతు గట్టెక్కినట్టు.. లేదంటే గరళం మింగి ప్రాణాలు తీసుకోవాల్సిందే. ఇవన్నీ వర్షాధార భూములు. ఈ నేలలో పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలు వేస్తున్నారు. వేసి..ఆకాశం వంక ఆశగా చూస్తున్నారు. ఒకవేళ బాగా వానలు పడినా, రేటు లేక ఆ ఆనందమూ నిలవడం లేదు. పైగా, కొద్దినెలల క్రితం వచ్చిన నీలం తుఫాను.. ఈ ప్రాంత రైతులను పూర్తిగా ముంచేసింది. పత్తి, మిర్చి పంట చేతికి వస్తున్నదనుకున్న సమయంలో తుఫాను రావడంతో సర్వనాశనం అయిపోయింది. ఇంతగా కుదేలయిన అన్నదాతకు సరైన పరిహారం ఇవ్వాలన్న జ్ఞానం కూడా ఈ పాలకులకు లేదా!

గరికపాడు రహదారిపై కొందరు రైతులు ఎదురుపడ్డారు. వానలు లేక, సాగునీరు అందే దారి లేక తడారిన తమ వ్యవసాయ క్షేత్రాన్ని నాకు చూపించి కన్నీళ్లు పెట్టారు. అదిమొత్తం నూటయాభై ఎకరాల్లో విస్తరించి ఉన్న క్షేత్రం. సాగునీటి వసతి లేక పరిశోధనలే జరగడం లే దట. కొన్నిచోట్ల చేలోనే పంటను తగలబెట్టుకున్నారని చెప్పారు. జగ్గయ్యపేట పట్టణానిదీ ఇదే పరిస్థితి. పట్టణానికి కృష్ణా నీళ్లు ఇస్తానని 2009కి ముందు హామీ ఇచ్చాను. నా తరువాత వాళ్లు ఆ విషయమే పట్టించుకోలేదు. అప్పటి 'మీ కోసం..'లో ఇచ్చిన ఆ హామీని ఇప్పటి 'మీకోసం..'లో మరోసారి స్థానికులు గుర్తుచేస్తుంటే బాధనిపించింది. ఏమిటీ దౌర్భాగ్యం!