December 10, 2012

పచ్చదనం కరువు!

పసుపు శుభకరం! పసుపు కొమ్ము మంగళకరం! కానీ, పసుపు పండించే రైతు జీవితం మాత్రం ఆందోళనకరం! మిగిలిన పంటలు పండించే రైతుల్లాగే పసుపు పండించే రైతుది కూడా కష్టాల దిగుబడే!

ఆదిలాబాద్ జిల్లా చర్లపల్లిలో నా పాదయాత్ర ప్రారంభమైన దగ్గర నుంచీ రోడ్డుకు ఇరు వైపులా ఎక్కడ చూసినా పచ్చగా పసుపు పంటే కనిపించింది! రైతులు కూడా పచ్చగా కళకళాలాడుతున్నారనుకుంటే పొరపాటే! ఆ రైతులంతా ఎక్కడికక్కడే నన్ను తమ పొలాల్లోకి తీసుకెళ్లి తమ కష్టాలను వివరించారు. సహజంగా అన్నీ బాగుంటే 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, కానీ, ఈసారి కరెంటు కోతల కారణంగా సమయానికి నీళ్లు పెట్టలేదని, దీంతో, దిగుబడి ఐదు నుంచి పది క్వింటాళ్లకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దిగుబడితోపాటు పంట నాణ్యత కూడా తగ్గిపోయిందని, దీంతో ధర 3500-4000కు పడిపోయిందని ఆందోళన చెందారు. పసుపునకు ప్రభుత్వం కనీస మద్దతు ధర కూడా ప్రకటించలేదని వివరించారు. ఇక్కడే యువ రైతు కలిశాడు. బీఈడీ చదువుకున్నాడట. ఉద్యోగం రాకపోవడంతో ఐదెకరాలు కౌలుకు తీసుకున్నాడట. అక్కడా ఇక్కడా అప్పులు చేసి పత్తి వేశాడు. దిగుబడి సరిగా రాలేదు. ఆ రైతన్న పూర్తిగా నష్టపోయాడు. ఇక్కడ అందరి రైతుల ఆందోళనా ఇదే!

రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. రైతుకు దిశానిర్దేశం చేసేవాళ్లు లేరు. పత్తిలాగానే పసుపునకు కూడా ప్రత్యేక బోర్డు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలి. లేకపోతే, మేం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఏర్పాటు చేస్తాం. పసుపునకు కనీస మద్దతు ధర ప్రకటిస్తే.. దానిని వేసుకోవాలా వద్దా అన్న విషయాన్ని రైతులే నిర్ణయించుకుంటారు. పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి!!