November 5, 2012

విదేశీ సంస్థలకు కొమ్ముకాసేందుకే కాంగ్రెస్ సభ



విదేశీ సంస్థలకు కొమ్ముకాసేందుకే కాంగ్రెస్ సభ
విదేశీ కంపెనీలకు రాహుల్ బ్రాండ్ అంబాసిడర్
అవినీతిపరులపై చర్యలేవి? : రేవంత్ రెడ్డి

విదేశీ సంస్థలకు కొమ్ముకాసేందుకే ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రజా సదస్పును ఏర్పాటు చేసిందని టీడీపీ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల వలన రైతులు, వ్యాపారులను చిన్నాభిన్నం చేసే విధంగా ఎందుకు ఎఫ్‌డీఐలను తీసుకువస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా సోమవారం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ వాల్ మార్ట్ ప్రచారకర్తగా వ్యవహరించారని ఆరోపించారు. కాంగ్రెసు ప్రజా సదస్సు పేరుతో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ విదేశీ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినట్లుగా ఉందన్నారు. సోనియా, రాహుల్‌లు తమ పేర్ల చివర్ల ఉన్న గాంధీని తొలగించుకోవాలని డిమాండ్ చేశారు. నాడు జాతిపిత మహాత్మా గాంధీ విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే.. నేడు రాహుల్ గాంధీ వాల్ మార్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రసంగిస్తున్నారన్నారు. దేశాన్ని నిర్దేశించ వ్యక్తిగా ఆయన తీరు లేదన్నారు.

అవినీతి క్యాన్సర్ వంటిదని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పడం విడ్డూరంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. అవినీతిపై సోనియా 16 నిమిషాలు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 20 నిమిషాలు, రాహుల్ గాంధీ 18 నిమిషాలు మాట్లాడారని, క్యాన్సర్ వంటిది అని చెప్పడం మినహా, అవినీతిపరులపై ఎలాంటి చర్యలు తీసుకుంటామో చెప్పలేదన్నారు. ఒక్క నిమిషం కూడా అవినీతిపరులపై తీసుకునే చర్యల గురించి మాట్లాడలేదన్నారు. సోనియా గాంధీ కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గాంధీ పేరును వారు తొలగించుకోవాలన్నారు.
No comments :

No comments :