November 15, 2012

రైతు బజార్ లో రైతు బేజార్

2002లో అనుకుంటా! రంగారెడ్డి జిల్లా ఖానాపూర్ నుంచి ఆర్టీసీ బస్సు బయలుదేరింది! బస్సు నిండా కూరగాయలు, కాయగూరల బుట్టలూ తట్టలూ! వాటి మధ్యలో రైతులు! దాదాపు 30-40 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్ చేరుకునేవారు! పచ్చని కూరగాయలతో రాజధానికి వచ్చి.. సాయంత్రానికి చల్లని చిరునవ్వుతో ఇంటికి చేరేవారు. ఒక్క ఖానాపూరే కాదు.. హైదరాబాద్ చుట్టుపక్కల, రంగారెడ్డి జిల్లాలోని ఏట్ల ఎర్రవల్లి, దేవారంపల్లి, ఘనాపూర్ తదితర గ్రామాల రైతులు వారి ఉత్పత్తులకు వారే ధర నిర్ణయించుకున్నారు!

ఇదంతా, అప్పట్లో మేం శ్రీకారం చుట్టిన రైతు బజార్ వ్యవస్థ చలవ! ఇందుకు రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేక బస్సులు కూడా వేశాం. రైతు బజార్ కాన్సెప్ట్‌ను రాజధానిలో ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాం. రైతు పండించిన పంటను రైతే విక్రయించుకునేలా చేశాం.

వ్యవస్థలను నిర్మించడం మా వంతు! కుప్పకూల్చడం కాంగ్రెస్ వంతు! మిగిలిన వ్యవస్థల తరహాలోనే రైతు బజార్ వ్యవస్థనూ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసేసింది. రంగారెడ్డి జిల్లా ఖానాపూర్‌లో పాదయాత్ర చేస్తుంటే తమ కష్టాలను రైతులే కళ్లకు కట్టినట్లు వివరించారు. పంటలు సరిగా పండడం లేదు. పండిన పంటనూ గిట్టుబాటు ధరకు అమ్ముకునే అధికారం వారికి లేదు. దళారులు మళ్లీ రంగప్రవేశం చేశారు.

రాజధానికి 30 కిలోమీటర్ల దూరంలోని పొలంలో పావలాకు కొంటున్నారు. దానిని హైదరాబాద్ తీసుకెళ్లి పది రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఇక్కడ రైతులూ నష్టపోతున్నారు. అక్కడ వినియోగదారులూ మోసపోతున్నారు. మధ్యలో దళారులు బలిసిపోతున్నారు.

మేం నిర్మించిన వ్యవస్థను పునర్నిర్మించాలంటే మళ్లీ మేమే రావాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బజార్ వ్యవస్థను పునర్నిర్మిస్తాం. రైతును రాజును చేస్తాం. దళారులను ఏరిపారేస్తాం. ఇటు రైతుకు, అటు వినియోగదారుకు సరసమైన ధర లభించేలా చూస్తాం.
No comments :

No comments :