March 13, 2013
ఇక ఉద్యోగులతోనే నా పయనం
ఐదు రోజులే పని!
వాళ్ల మాటే వింటా
పశ్చిమ యాత్రలో చంద్రబాబు వ్యాఖ్య
అది టీఆర్ఎస్ కాదు.. సూట్‌కేసు పార్టీ
సంఘీభావంగా నడిచిన ఎన్ఆర్ఐలు
పూలకొట్టు దగ్గరకెళ్లి.. "మీ జీవితాలు మల్లెపూలు ఉన్నంత తెల్లగా ఉన్నాయా'' అని ఓ మహిళను పలకరించారు. యాత్రకు సంఘీభావంగా రక్తదానం చేసిన రైతులను శిబిరానికి వెళ్లి అభినందించారు. పాదయాత్రకు మద్దతుగా కొంతమంది ఎన్నారైలు చంద్రబాబుతో కలిసి కొద్ది దూరం నడవడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రవాసాం««ద్రుల బృందంలో పీవీవీ రామరాజు (అఫ్ఘానిస్థాన్), కెనడా ఎన్ఆర్ఐ వింగ్ నాయకుడు కొడాలి నవీన్ చౌదరిసహా 10 మంది ఉన్నారు. అనంతరం పాలకొల్లు సభలో ఆయన మాట్లాడారు. అవినీతి రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు ఉద్యోగులు కలిసి రావాలంటూ ఉత్సాహపరిచారు. అన్ని విధాలా అండగా ఉంటానని ప్రకటించారు.
ఉద్యోగవర్గాల సమస్యలను ఏకరువు పెట్టారు. 'ఉద్యోగులుగా మీరెంతో కష్టపడుతున్నా పేరూ పెంపు లేదు. ఆర్టీసీ ఉద్యోగుల నుంచి, గ్రామసహాయకుల దాకా అంతా కష్టాల్లో ఉన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణం. అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలు పరిష్కరిస్తా' అని భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. 'అవిశ్వాసం' అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. టీఆర్ఎస్ పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వరాదని ఇప్పటికే టీడీపీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. " అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలా'' అని పాలకొల్లు సభావేదిక నుంచి ప్రజలను కోరగా, వారంతా "వద్దు.. వద్దు'' అని నినదించారు.
"రాష్ట్రంలో సూట్ కేసు రాజకీయాలకు, లాలూచీ రాజకీయాలకు తెరదించాలి. ఈప్రయత్నంలో ప్రజలంతా నాకు సహకరించాలి. ఒకవైపు మా ఎమ్మెల్యేలను కొంటుంటే, మరోవైపు అవిశ్వాసంపై వారికి (వైసీపీ) మేం మద్దతు ఇవ్వాలా? జగన్ జైలులో కూర్చుని మంతనాలు నడుపుతూ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తుంటే చూస్తూ ఉరుకోవాలా? బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేసే టీఆర్ఎస్.. అవిశ్వాసం పెడతానంటే మేము సహకరించాలా?' అని మండిపడ్డారు.
టీఆర్ఎస్‌ది బ్లాక్‌మెయిల్ అని, అదో సూట్‌కేసుల పార్టీ అని ఎద్దేవాచేశారు. "ఏ వానకు ఆ గొడుగు పట్టే టీఆర్ఎస్.. మమ్మల్ని వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తోంది. చూస్తూ ఊరుకుందామా?'' అని ప్రశ్నించారు. అవిశ్వాసం పెడితే ప్రజా సమస్యలపై పెడతామే గానీ రహస్య అజెండాలతో కాదని స్పష్టం చేశారు. జగన్ పత్రికపైనా ఆయన నిప్పులు చెరిగారు. పెట్టాలంటే ఇప్పటికే అలాంటివి పది పేపర్లు పెట్టేవాడినని చెప్పుకొచ్చారు. గవర్నర్ ప్రసంగంలో ఎలాంటి పస లేదని ఆక్షేపించారు.
Posted by
arjun
at
10:51 PM