March 13, 2013
అదే జనం..అదే నడక

పార్టీ విజయానికి మరింత గట్టి పునాదివేసే క్రమంలో కార్యకర్తలు పడుతున్న పాట్లను అడిగి తెలుసుకున్నారు. అక్రమ కేసులు పెడుతున్నారంటూ కార్యకర్తలు ఆవేదన చెందినప్పుడు.. 'అక్రమ కేసులు పెడితే ఖబడ్దార్' అంటూ కాంగ్రెస్ సర్కార్‌కు వార్నింగ్ ఇచ్చారు. మన విజయాన్ని అడ్డుకోవడానికి వాళ్లు ఇలాంటి తప్పుడు కేసులు పెడతారు. ఇక ముందు కూడా పెడతారు. మన వాళ్లను జైళ్లలో కుక్కి మన విజయాలను అడ్డుకోవాలని చూస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి అంటూ కార్యకర్తలకు సూచించారు. 'ఏది ఏమైనా నేను చూసుకుంటాను. మీరు మాత్రం ముందుకే వెళ్లండి' అంటూ ధైర్యాన్ని నూరిపోశారు. ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది, సిద్ధంగా ఉండండి అంటూ కూడా పిలుపునిచ్చారు.
దెందులూరు, నిడదవోలు నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఇది సహజంగానే పార్టీ అధినేతకు సంతృప్తినిచ్చింది. కార్యకర్తలు నిర్మొహమాటంగా మాట్లాడుతున్నప్పుడు 'స్పీచ్‌ల్లో మన వాళ్లంతా ఆరితేరిపోయినట్లు ఉన్నారు' అంటూ చమత్కరించి కార్యకర్తల నుంచి హర్షధ్వానాలు అందుకున్నారు. అలాగే పెన్నాడ మార్కెట్ యార్డు సెంటర్ నుంచి ఆయన సాయంత్రం వేళ పూలపల్లి వైపు ముందుకు సాగారు. దారికి ఇరువైపులా వందలాదిమంది ఆయన రాకకోసం ఎదురు చూశారు. ఆయనకు దగ్గరగా వెళ్లి చూసేందుకు కొందరు, కరచాలనం చేసేందుకు ఇంకొందరు, తమను తాము పరిచయం చేసుకునేందుకు మరికొందరు పోటీలు పడుతున్నప్పుడు పోలీసులు కొన్నిచోట్ల అడ్డుకున్నారు. దీనిని గమనించిన చంద్రబాబు వారిని తన దగ్గరకు పిలుచుకుని మరీ సంభాషించి పంపించి సంతృప్తిపరిచారు.
దారిపొడవునా వందలాది మంది ఆయన అడుగులో అడుగు కలిపారు. శృంగవృక్షం, వీరవాసరం సెంటర్లు జనసంద్రమయ్యాయి. పార్టీ నేతలు ఒకవైపు తన వెంట నడుస్తుండగానే ఇంకోవైపు తన కోసం రోడ్డుకిరువైపులా వేచిచూస్తున్న మహిళల దగ్గరకు వెళ్లి వారిని పలకరించారు. ఎలా ఉన్నారమ్మా అంటూ ప్రశ్నించి వారి బాగోగులను అడిగి తెలుసుకుంటూ 'ఒక పెద్దన్నయ్యగా మీ ముందుకొచ్చా. తప్పనిసరిగా పార్టీ అధికారంలోకి రాగానే మీకు ఏలోటూ రాకుండా చూసుకుంటా'నంటూ వారికి భరోసా ఇచ్చారు. యువకులు, కార్యకర్తలు ఉత్సాహం ప్రదర్శించారు. దారిపొడవునా కొందరు నృత్యాలు చేస్తూ డప్పు వాయిద్యాల మధ్య పార్టీ అధినేతకు స్వాగతం పలికారు. ఈ ఉత్సాహ వాతావరణం గమనించిన బాబు వీరవాసరానికి ముందు కోలాట బృందంతో కలిసి సరదాగా కోలాటం ఆడారు.
మిరపకాయ బజ్జీ రూ. 2 వేలు! మార్గమధ్యలో ఒక పచ్చిమిరపకాయ బజ్జీని రుచి చూసి, ఇదిగో ఈ రెండు వేలు ఉంచుకోండి అంటూ దుకాణం యజమానికి ఇవ్వడంతో ఆయన తబ్బిబ్బు అయ్యారు. పదవ తరగతి చదువుతున్న పిల్లలను బాగా చదువుకోండి అంటూ ప్రోత్సహించారు. ఇద్దరు పేద డిగ్రీ విద్యార్థులకు రెండు వేల రూపాయల సాయం అందించారు. నాలుగో రోజు పాదయాత్ర అత్యంత ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉత్తేజంగా సాగింది. పార్టీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, శివరామరాజు, బూరుగుపల్లి శేషారావు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు, పార్టీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, గాదిరాజు బాబు, గన్ని వీరాంజనేయులు, ముళ్లపూడి బాపిరాజు తదితరులు అంతా పాల్గొన్నారు.
బాబూ ఎలాగుంది? భీమవరంపై గాదిరాజును ఆరా తీసిన చంద్రబాబు 'భీమవరం పట్టణంలో మంచి స్వాగతం పలికారు. నా యాత్రకు వచ్చిన జనం చూసి సంతృప్తి పడ్డాను. బాగా చేశారు. భీమవరంలో తాజా పరిస్థితులు ఏమిటి?' అంటూ పార్టీ నేత గాదిరాజు బాబును పార్టీ అధినేత స్వయంగా ఆరా తీశారు. 'ఎప్పుడూ బయటకు రాని కొన్ని కుటుంబాలకు చెందిన మహిళలు కూడా మిమ్మల్ని స్వయంగా చూసేందుకు తొలిసారిగా వీధుల్లోకి వచ్చారు. ఇది భీమవరంలో ఆల్‌టైమ్ రికార్డు' అని గాదిరాజుబాబు పార్టీ అధినేతకు వివరించారు. భీమవరం పట్టణంలో సోమవారం తనకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం పట్ల చంద్రబాబు పూర్తిస్థాయి సంతృప్తి వ్యక్తం చేశారు.
Posted by
arjun
at
3:25 AM