
ప్రజలను మభ్యపెడుతూ రోజుకో తీరుగా మాటల
గారడీ చేస్తున్న పాలకులు, కొన్నిపార్టీల నాయకుల ప్రవర్తనను చూసి తనకంటే
బాగా రంగులు మారుస్తున్నారని ఊసరవెల్లులు సైతం సిగ్గుపడుతున్నాయని
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఘాటైన విమర్శలు
చేశారు. మంగళవారం తిరువూరు నియోజకవర్గంలోని ఎ.కొండూరు, గంపలగూడెం మండలాల్లో
సాగిన ఆత్మగౌరవయాత్రలో ఆయనమాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ స్వార్థ
రాజకీయం కోసం రాష్ట్రంలో విభజన చిచ్చు రేపాయని, పిల్ల కాంగ్రెస్ అయిన
వైఎస్సార్‌కాంగ్రెస్ గంటకో ప్రకటనతో ప్రజలను మభ్యపెట్టేందుకు
ప్రయత్నిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో
రాష్ట్రాన్ని శాస్త్ర, సాంకేతిక రంగాలతో సైతం అభివృద్దిపథం
లో పయనింపచేస్తే
మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం
చేసిందని నేడు యువత నిర్వీర్యమైపోతుందని ఆవేదన చెందారు. రాష్ట్రాన్ని
వంతులు వారీగా దోచుకుతింటున్నారని, ప్రజలకు సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం
అమలుచేసిన సంక్షేమ పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేసి అధిక ధరలను ప్రజలపై
మోపుతున్నారని ఉల్లిపాయలతోపాటు నిత్యావసరధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు.
సోనియాగాందీ తన కుమారుడిని ప్రధానమంత్రిని చేయాలని లక్ష్యంతోటే
రాష్ట్రాలను సైతం అగ్నిగుండాలుగా మారుస్తున్నారని ఆరోపించారు.
ఈ యాత్రలో నియోజకవర్గ కన్వీనర్ నల్లగట్ల స్వామిదాసు, జిల్లాపార్టీ
అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, మాజీ
చీప్‌విఫ్ కాగితం వెంకట్రావు, మాజీచైర్‌పర్సన్ నల్లగట్ల సుధారాణి,
విజయవాడ పార్లమెంటరీ ఇన్‌ఛార్జి కేశినేని నాని, వల్లభనేని వంశీమోహన్, సుంకర
కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు.