April 28, 2013
ఎర్రన్నాయుడి తనయుడి ఉద్వేగ ప్రసంగం

రామ్మోహన్‌నాయుడు ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. సభా వేదికపై అందరూ పోడియం దగ్గరకు వెళ్లి మాట్లాడగా.. రామ్మోహన్ మాత్రం మైకు పట్టుకుని చంద్రబాబు వద్దకు వెళ్లి పెద్దలందరినీ పేరుపేరున ప్రస్తావించి ప్రసంగం చేశారు. ఆరు పదుల వయసులో సుదీర్ఘ పాదయాత్ర చేసి చంద్రబాబు తెలుగు ప్రజల గుండెల్లో ఆత్మవిశ్వాసం నింపారని, దేశానికే స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు.
రాష్ట్రం నలుమూలల నుంచి ఉప్పెనలా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు ఇదే ఉత్సాహంతో వచ్చే ఎన్నికల వరకు పనిచేసి టీడీపీని అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పీఠంపై చంద్రబాబును అధిష్ఠింపజేయాలని, ఢిల్లీలో తెలుగుదేశం చక్రం తిప్పాలని ఆకాంక్షించారు. తన తండ్రి ఆశయం కూడా అదేనని, దాన్ని నెరవేర్చే బాధ్యత శ్రీకాకుళం జిల్లా ప్రజలు తన భుజస్కంధాలపై మోపారన్నారు.
అందుకు శాయశక్తులా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. తనకు చంద్రబాబు అండగా నిలిచారని, అలాగే అభిమానంతో శ్రీకాకుళం నుంచి తరలివచ్చిన అశేష అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. రామ్మోహన్‌నాయుడు ప్రసంగం ఆద్యంతం ఉత్సాహంగా, ఉద్రేకంగా, ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సాగడంతో చంద్రబాబు సహా అందరూ ఆసక్తిగా విన్నారు. ప్రసంగం తర్వాత రామ్మోహన్‌ను పిలిచి 'శెభాష్' అంటూ చంద్రబాబు భుజం తట్టారు.
Posted by
arjun
at
12:22 AM