April 29, 2013
ఇక బాబు బస్సు యాత్ర! జూన్ నుంచి చంద్రబాబు 'జన యాత్ర'
మిగిలిన జిల్లాలు, నియోజకవర్గాల్లో పర్యటన

స్థూలంగా ఇప్పటి వరకు వచ్చిన అభిప్రాయం మేరకు.. జూన్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆయన బస్సు యాత్రను చేపట్టనున్నారు. పాదయాత్రలో ఆయన 16 జిల్లాల్లోని 86 నియోజక వర్గాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఏడు జిల్లాల్లో చంద్రబాబు పర్యటించలేదు. వీటిలో హైదరాబాద్ మినహా మిగిలిన ఆరు జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆయన పర్యటన ఉంటుంది. ఈ జిల్లాల్లో పర్యటన పూర్తయిన తర్వాత మిగిలిన 16 జిల్లాల్లో మిగిలిపోయిన శాసనసభ నియోజక వర్గాల్లో కూడా పర్యటించాలని చంద్రబాబు యోచిస్తున్నారు.
ఎన్నికలకు వ్యవధి తక్కువగా ఉన్నందున బస్సు ద్వారా అయితే అన్ని నియోజక వర్గాల్లోనూ పర్యటించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. 2009 ఎన్నికలకు ముందు కూడా ఆయన 'మీ కోసం' పేరిట రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు. ఈసారి యాత్ర కూడా అదే తీరులో ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూన్ నుంచి సుమారు ఆరు నెలలపాటు మిగిలిన అన్ని నియోజక వర్గాల్లోనూ పర్యటించాలనేది చంద్రబాబు వ్యూహం. నిరంతరాయంగా ప్రజల్లో ఉండటం ద్వారా తాము చెప్పదల్చుకున్న విషయాలను బలంగా వారికి చేరవేయవచ్చని, అదే సమయంలో పార్టీ శ్రేణులను కూడా ఉత్తేజపర్చవచ్చన్న భావనతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు.
రెండో విడత యాత్ర చేపట్టడానికి ముందు మే నెలలో తనకు అందుబాటులో ఉన్న సమయాన్ని పార్టీ సంస్థాగత వ్యవహారాలను చక్కబెట్టడానికి వినియోగించాలని భావిస్తున్నారు. అప్పటి వరకు సంస్థాగతంగా ఉన్న లోటుపాట్లు, నియోజక వర్గాల్లో నాయకత్వ సమస్య, నేతల మధ్య సమన్వయ లోపం వంటి వాటిపై ఆయన దృష్టి పెట్టబోతున్నారు. మే నెలఖరులో హైదరాబాద్‌లో పార్టీ మహానాడుని ఘనంగా నిర్వహించనున్నారు. ఆ తర్వాతే ఆయన రెండో విడత యాత్ర మొదలవుతుందని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి.
Posted by
arjun
at
6:53 AM