March 15, 2013
రైతులను కాపాడతా : చంద్రబాబు

వస్తున్నా మీకోసం యాత్రలో భాగంగా 165వ రోజైన శుక్రవారం ఆయన ఇరగవరం నుంచి పైడిపర్రు వరకు వివిధ సభల్లోనూ మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న దుస్థితిని ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. తెలుగుదేశం అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరించారు. సుమారు పది కిలోమీటర్ల మేర సాగించిన పాదయాత్రకు ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన లభించింది. అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. తాము పడుతున్న కష్టాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన కూడా ఇప్పుడున్న అవినీతి ప్రభుత్వమా కాదా అని ప్రశ్నలు సంధించారు. మీరంతా కష్టా ల్లో ఉన్నారా, ఆనందంగా ఉన్నారా అని వారిని అడిగి తెలుసుకుంటూనే త ల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లపై వాగ్బాణాలు గుప్పించారు. విమర్శలు గు ప్పించారు.
ఇప్పటిదాకా ప్రజలకు ఏమీ చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉందని అన్నారు. ఇక సూట్‌కేసు రాజకీయాలకు అలవాటుపడిన వారు ప్రజా సంక్షేమాన్ని, పార్టీ విశ్వాసాలను కుప్పకూల్చి అడ్డదారులు తొక్కుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఆలోచన వీరిలో ఎక్కడా లేదు. డబ్బులు కూడగట్టుకోవడానికి మాత్రం పరుగులుపెడుతున్నారు. ఈ రాజకీయాలను మీరు సమర్థిస్తారా అంటూ ప్రజలపై ప్రశ్న్రాస్తాలు సంధించారు. అడవి పందుల మాదిరిగా దోచుకుతింటున్నారని, అయినా ధర్మం, న్యాయం, నీతి గెలుస్తుందని, ఈ మూడు తమ పార్టీలో ఉన్నాయని చంద్రబాబు ప్రజలకు వివరించారు. విలువలతో కూడిన రాజకీయాలకు మొదటి నుంచి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు.
అలాంటి రాజకీయాలకే మేము కట్టుబడి ఉంటాం అని స్పష్టం చేశారు. సీఎం ఒక చేతకానివాడిగా అభివర్ణించారు. రైతులు కిడ్నీలు అమ్ముకునే పరిస్థితి ర్రాష్టంలో దాపురించింది. ఇంతకంటే ఘోరం ఏముంటుందని నిలదీశారు. కరెంటు సమస్యలు తీర్చరు, రైతు సమస్యలను పట్టించుకోరు, డ్వాక్రా మహిళలను బెదిరిస్తారు, చదువు సంధ్యలను నాశనం చేశారు.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ కష్టాలే మిగిలాయని దుయ్యబట్టారు. దద్దమ్మలు రాజ్యమేలుతున్న కారణంగానే ఇలాంటి పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. 'పులివెందులలో ప్రజాస్వామ్యం లేదు, రౌడీస్వామ్యం ఉంది. వైఎస్ కుటుంబంది అంతా అరాచకమే.
అలాంటి వాళ్లు ఇప్పుడు ఏవేవో మాట్లాడుతున్నారు, ఈ మాటలకు మోసపోవద్దు' అని పిలుపునిచ్చారు. రైతులను కాపాడుకునే బాధ్యతను నేనే తీసుకుంటానని స్పష్టం చేశారు. 30 ఏళ్లు రాజకీయ జీవితం అందిస్తే మా పార్టీలో కూడా సూట్‌కేసులకు అమ్ముడుపోయిన వాళ్లని ఏమనాలో అర్థం కావడం లేదని అన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే రైతు సంక్షేమానికి పెద్దపీట వేయడమే కాకుండా చదువుకునే పిల్లలందరికీ సైకిళ్లు ఉచితంగా అందిస్తామన్నారు. ఇక ర్రాష్టానికి మోటారు సైకిళ్లు, కార్లు కాదని, సైకిలే దిక్కని ఆయన అన్నారు. సాక్షి పత్రిక, ఛానల్‌పైనా విరుచుకుపడుతూ అవినీతితో కూడగొట్టుకున్న సొమ్ముతో ఇలాంటి విషపూరిత పత్రికలు పెట్టి మమ్మల్నే లక్ష్యం గా చేస్తున్నారని, అయినా భయపడేది లేదని స్పష్టం చేశారు.
ఈరోజు మీ అందరి అండతో, మీరిస్తున్న స్ఫూర్తితోనే ముందుకువెళ్తున్నాను, ఇదొక ధర్మపోరాటమని అన్నారు. చేనేత కార్మికులు, గీత కార్మికులను ఖచ్చితంగా ఆదుకుంటామని, కౌలు రైతుల విషయంలో కూడా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తామని ఆయా వర్గాలకు భరోసా ఇచ్చారు. అలాగే తెలుగుదేశం ప్రతిపాదిస్తున్న అన్ని హామీలను నిక్కచ్చిగా అమలు చేస్తామని అన్నారు. ప్యాకేజీలను నమ్మి పార్టీకి ద్రోహం చేసిన వారిపై కూడా ఓ కన్నేసి వుంచుతామన్నారు. ఏకబిగిన కోట్లు కోట్లు సంపాదించిన వారు ఐదేళ్లు జైళ్లలో గడిపి తిరిగి వాటిని అనుభవిద్దామని చూస్తున్నారని ఆరోపించారు. నిజం నిప్పులాంటిదన్నారు.
Posted by
arjun
at
10:06 PM