March 15, 2013
ఎలా బతుకుతారో ఏమో..!

రిక్షావాళ్ల గురించి ఆలోచించడం ఒక ఎత్తు.. ఇలాంటి వృద్ధులు రిక్షా లాగి బతకాల్సిన స్థితిని గురించి బాధపడటం వేరు! మార్టేరు సెంటర్‌లో కాసేపు మాట్లాడాను. తిరిగి మాట్లాడేందుకు కూడా ఓపిక ఉన్నట్టు లేదు. కాకపోతే.. కళ్లలో కాస్త జీవకళ! "మీరు మా ఊరు వచ్చారని తెలిసి వచ్చాను. నిన్ను చూడటం చాలా సంతోషంగా ఉంది నాయనా'' అంటుంటే మాట తడబడింది. అది వృద్ధాప్యం వల్ల కాదు.. నన్ను చూసిన ఆనందంతో కలిగిన తత్తరపాటు అని తెలుస్తూనే ఉంది. ఇలాంటి అభాగ్యులు ఎలా బతుకుతున్నారో ఆ భగవంతుడికే తెలియాలి!
ఆడపడుచుల చేతుల్లో ఖాళీ బిందెలు..నీళ్లు కూడా లేని రైతుల కళ్లు. ఇవి చాలవా.. కాలువల్లో నిధులు తప్ప నీళ్లు పారడం లేదని చెప్పేందుకు! పెనుకొండలో అన్నదాతల బాధలు వింటే కలిగిన భావమిది. నీలం తుఫాను వచ్చి సగం నాశనం చేసిపోయిందట. శీతకన్నేసిన సర్కారు మిగతా సగం ప్రాణమూ తీస్తోందట. వరద సాయం కింద కోట్లు విడుదలయినట్టు వినడమే గానీ, ఒక పైసా కళ్ల చూడలేదట. " పెనంపై ఉన్నాం. మున్ముందు ఏకంగా పొయ్యిలోకి నెట్టేసేటట్టు ఉన్నారు సార్'' అన్న ఆ రైతు కళ్లలో భయం పోయి.. సర్కారుకు భయం పుట్టించేదెప్పుడో!
Posted by
arjun
at
12:44 AM