‘నీకు మానవత్వం ఉంటే ఆత్మవిమర్శ చేసుకుని టీడీపీ
మద్దతుగా రా.. కలసి తెలంగాణ తెద్దాం’అంటూ టీడీపీ శాసనసభాపక్ష ఉప నేత
మోత్కుపల్లి నర్శింహులు టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావును
కోరారు. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌తో కలసి ఆయన ఆదివారం ఎన్టీఆర్‌భవన్ లో
విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఆంధ్రప్రాంత పెట్టుబడిదారులు, వ్యాపారుల నుంచి కేసీఆర్, ఆయన కుటుంబ
సభ్యులు ఎంతెంత వసూళ్లు చేశారో,ఆలిస్టు తన దగ్గర ఉందని మోత్కుపల్లి
చెప్పారు. ఏదో ఒకరోజు దానిని బయటపెడతానన్నారు. విజయవాడ ఎంపీ లగడపాటి
రాజగోపాల్‌తో కలసి కేసీఆర్ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం
చేస్తున్నారని, ఇద్దరూ తోడుదొంగలని ఆరోపించారు. డబ్బుల కోసం కొంతమందిని
పార్టీలో చేర్చుకుంటున్నారని, ఆదివారం పార్టీలో చేరిన విశ్వేశ్వరరెడ్డి
నుంచి, టీడీపీ నుంచి ఆ పార్టీలో చేరిన మర్రి జనార్దన్‌రెడ్డి నుంచి కేసీఆర్
ఎన్నికోట్లు తీసుకున్నారో..నంటూ అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు
ఆనాడు నిజాంను తరమినట్టే వచ్చే ఎన్నికలలో కేసీఆర్‌ను తరుముతారని చెప్పారు.
వందసీట్లు వస్తాయని చెప్పుకుంటున్న కేసీఆర్‌కు వచ్చేఎన్నికలో పది,ఇరవై
సీట్లు కూడా రావని మోత్కుపల్లి అన్నారు.