April 25, 2013
క్యారెక్టర్ లేనివాళ్ల ఆరోపణలు పట్టించుకోకండి కార్యకర్తలకు చంద్రబాబు సూచన
జగన్ ఆస్తులను జప్తు చేయాలి
అలా చేస్తే భవిష్యత్తులో ఎవరూ మోసాలు చేయరు
ఇన్‌చార్జులంతా అభ్యర్థులు కారు

తనను విమర్శిస్తున్న షర్మిల, బొత్స వంటి నేతలెవ్వరికీ క్యారెక్టర్లు లేవని, అలాంటివారు చేసే విమర్శలు, ఆరోపణలను పట్టించుకోనక్కర్లేదని టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ఇన్‌చార్జులకే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామని ఆయన ప్రకటించారు. గతంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అభ్యర్థులను ప్రకటించేవారమని, కానీ ఈసారి ముందే ప్రకటిస్తామని చెప్పారు. గెలవలేనివారికి టిక్కెట్లిచ్చి ప్రతిపక్షంలో కూర్చోవడానికి పార్టీ సిద్ధంగా లేదన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జులకే టిక్కెట్లు ఇస్తానని తానెక్కడా అనలేదని, గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినచోట్ల పార్టీ పటిష్ఠం కావడానికే ఇన్‌చార్జులను నియమించామని చెప్పారు.
వారిలో కొందరు బస్సులో సీటు కోసం తువ్వాలు వేసిన చందంగా టిక్కెట్టు తమకే అన్నట్టు ధీమాగా ఉంటున్నారని, వాళ్లు పద్ధతి మార్చుకోవాలని చంద్రబాబు సూచించారు. నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ, కార్యకర్తల కష్టాల్లో పాలుపంచుకున్న వారే నిజమైన ఇన్‌చార్జులని, కష్టపడి పనిచేసేవారికే టిక్కెట్లిస్తానని స్పష్టం చేశారు. "రాష్ట్రంలో చట్టాలను అమలుచేయాల్సిన హోంమంత్రి సబితారెడ్డి ఓ నేరస్థురాలు.
ఓబుళాపురం గనుల కేసులో ఆమె ఏ-4 నిందితురాలు. ఇలాంటి వారు మంత్రులైతే ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది'' అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. 'సిమ్స్' సంస్థ వల్ల మోసపోయిన కొందరు చంద్రబాబు ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు వల్ల తమకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, ఈ ప్రభుత్వం గుడ్డి దున్నపోతుతో సమానమని, కాంగ్రెస్ పాలనలో ఎవరికీ న్యాయం జరగదని అన్నారు. సిమ్స్ బాధితులకు న్యాయం జరిగేవరకు టీడీపీ అండగా నిలుస్తుందన్నారు.
Posted by
arjun
at
11:06 PM