
కరీంనగర్: బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం
అడ్డుకునేందుకు అవసరమైతే పదవులకు రాజీనామా సిద్ధమని టీడీపీ పొలిట్‌బ్యూరో
సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. శుక్రవారం బాబ్లీ
ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట టీడీపీ నిర్వహించిన
ధర్నాలో ఎర్రబెల్లి మాట్లాడారు. బాబ్లీ పూర్తయితే తెలంగాణ ఎడారిగా మారే
ప్రమాదం ఉందన్నారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే బాబ్లీ పనులు
ప్రారంభమయ్యాయని, హరీశ్‌రావు మంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డి ప్రాజెక్టు
నిర్మాణం జరిగిందని, తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతున్న కేసీఆర్ నోరు
మెదపకపోవడం చూస్తే కాంగ్రెస్‌తో కుమ్మక్కయినట్లు కనిపిస్తోందన్నారు.
సుప్రీంతీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్
చేశారు. ప్రభుత్వంలో చలనం తెచ్చేందుకు త్వరలో 'చలోఢిల్లీ' ఆందోళన
చేపడతామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ముఖ్యమంత్రి అఖిల పక్షం
ఏర్పాటు చేసి ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.
ధర్నాలో ఎమ్మెల్యే విజయ రమణరావు, మాజీ మంత్రులు ఎల్ రమణ, పెద్దిరెడ్డి,
సుద్దాల దేవయ్య పాల్గొన్నారు.