February 11, 2013
రాష్ట్రాన్ని భోంచేశాడు.. వెంకన్నతో పెట్టుకోవద్దని చెప్పా
వైఎస్.. ఓ కబంధుడు!
అదే దారిలో కిరణ్.. తిరుమల కొండపై స్మగ్లింగ్‌కు అండ
వీళ్ల పని ఎలా పట్టాలో ఆ దేవుడికి తెలుసు
గుంటూరు పాదయాత్రలో చంద్రబాబు హెచ్చరిక
తిరుమల వెంకన్నతో పెట్టుకోవద్దని నాడే వైఎస్‌ను హెచ్చరించానని గుర్తుచేశారు. గుంటూరు పట్టణం రింగురోడ్డులోని సిద్ధార్థ గార్డెన్స్ నుంచి సోమవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. నాడు వైఎస్, నేడు కిరణ్ ఒకే తప్పు చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన గట్టిగా హెచ్చరించారు. "తిరుపతి కొండల్లో విశాలమైన భూమి ఉండటంతో నేను ఆనాడు ఎర్రచందనం మొక్కలు నాటించాను. కాంగ్రెస్ దొంగలు ఆ ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. స్మగ్లర్లకు సీఎం కిరణ్ కొమ్ము కాస్తున్నారు.
తిరుపతి వెంకటేశ్వరస్వామికి అపకారం చేస్తే వాళ్ల భరతం పట్టే పని ఆయనే చూసుకొంటారు. అసెంబ్లీ సాక్షిగా నేను వైఎస్‌కు కూడా చెప్పారు. ఎవరి జోలికి పోయినా ఫర్వాలేదు కాని వెంకటేశ్వరస్వామి జోలికి వెళ్ళొద్దన్నాను. ఆయన నా మాట వినలేదు. నేను చిన్నప్పటి నుంచి ఆ వెంకన్న స్వామి పాదాల చెంతన ఉన్నాను. ఆయన పవర్ ఏమిటో నాకు తెలుసు'' అని వివరించారు. వైఎస్ పుణ్యాన గాలి జనార్దనరెడ్డి మొత్తం ఖనిజాన్ని దోచేశారని, కంచం, మంచం, కుర్చీతో పాటు తాను వినియోగించే వస్తువులన్నింటిని బంగారంతో చేయించుకొని.. ఆడబిడ్డలు బంగారు తాళిబొట్టులూ కొనలేని పరిస్థితి కల్పించాడని దుయ్యబట్టారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజల ఎన్నుకొన్న ముఖ్యమంత్రి కాదని, సోనియాగాంధీ పంపిన సీల్డ్‌కవర్ సీఎం అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఢిల్లీకి వెళ్లి రెండు ఇంగ్లీషు ముక్కలు మాట్లాడటంతో కాంగ్రెస్ పెద్దలు ఆయన ఏదో సాధిస్తాడని పదవి కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. తన పీఠం కాపాడుకొనేందుకు ఏదైనా చేస్తారని దుయ్యబట్టారు. దొంగ మంత్రులను కాపాడుతున్న కిరణ్ కూడా నేరస్థుడేనని మండిపడ్డారు. అనంతరం 100 మంది చర్మకారులకు మాదిగ అభివృద్ధి సంస్థ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చంద్రబాబు గొడుగులు పంపిణీ చేశారు. నీట్ పరీక్ష రద్దుకు సీఎం కిరణ్‌కు లేఖ రాయడంతో పాటు పోరాటం చేస్తానని..విద్యార్థులకు హామీ ఇచ్చారు.
జగన్ పేపర్, టీవీ చూడొద్దు
విషకన్య లాంటి జగన్ టీవీని చూడొద్దని, పేపర్‌ను చదవొద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ తన నేరాలను ఆ టీవీ, పేపర్‌తో కప్పి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాగా,పాదయాత్రపై వ్యతిరేక వార్తలు రాస్తోందంటూ గుంటూరులోని జగన్ పత్రిక కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు వేశారు. పాదయాత్ర బ్రాడీపేట దాటుతుండగా జరిగిన ఈ ఘటనలో కార్యాలయం అద్దాలు పగిలాయి.
Posted by
arjun
at
11:34 PM