February 11, 2013
తల్లి, పిల్ల కాంగ్రెస్‌తో ప్రమాదం
కిరణ్ దుకాణం తెరిచాడు
ఉద్యోగాలను సొమ్ము చేసుకుంటున్నాడు
లోటస్‌పాండ్‌లో దెయ్యాల కాపురం
లోక కల్యాణం కోసమే పాదయాత్ర: చంద్రబాబు
జగన్ లోటస్‌పాండ్‌లో 72 గదుల్లో ప్యాలెస్ నిర్మించాడని, అందులో దయ్యాలు కాపురాలు చేస్తాయి తప్ప మనుషులు కాదన్నారు. చంద్రబాబు 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర అగతవరప్పాడు నుంచి ప్రారంభమైంది. ప్రజల సమస్యలు తెలుసుకొంటూ, వాటిపై స్పందిస్తూ చంద్రబాబు ముందుకు సాగిపోయారు. గుంటూరు రింగ్‌రోడ్డు సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కిరణ్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుమారుడు జగన్, అల్లుడు అనిల్‌పై అవినీతి ఆరోపణలతో చంద్రబాబు విరుచుకుపడ్డారు. అధికారంలోకి వస్తే బెల్టు షాపులను మూసేస్తానని మరోసారి హామీ ఇచ్చారు.
జలయజ్ఞంలో అవినీతి బట్టబయలు
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు అవినీతిపరుల గుండెల్లో నిద్రపోయారని.. తాను అధికారంలోకి వచ్చాక అదే బాటలో పయనించానని చంద్రబాబు చెప్పారు. అయితే, వైఎస్ అధికారంలోకి రావడంతోనే జలయజ్ఞం పేరుతో అవినీతి గేట్లు బార్లా తెరిచారని తెలిపారు. "జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తున్నాడని నేను ఆనాడే చెప్పాను. నా ఆరోపణలను నిజం చేస్తూ.. నేడు కాగ్ జలయజ్ఞంలో రూ.30 వేల కోట్లు దారి మళ్లాయని కుండబద్దలు కొట్టింది'' అని వివరించారు. ఎద్దును పట్టుకోకుండా తాడును కొన్నట్టుగా సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు తీసుకోకుండా, జలాశయాలు నిర్మించకుండా కాలువలు తవ్వేశారని చెప్పారు. వాటికి కూడా దొంగ లెక్కలు రాసి డబ్బులు కొట్టేశారని ఆరోపించారు.
23 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పి చివరికి 23 వేల ఎకరాలకు కూడా ఇవ్వలేదన్నారు. వైఎస్ హైదరాబాద్‌లో 8 వేల ఎకరాలను తన సన్నిహితులకు ధారాదత్తం చేశాడని.. ఒక్కో ఎకరం విలువ రూ. 20 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. బ్రదర్ అనిల్ చేసేవన్నీ దొంగ ప్రార్థనలేనన్నారు. అతని మాటలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు.
అవినీతి విషయంలో ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలని, మన సంపద, కష్టాన్ని దోచుకొన్న వారిపై రాజీలేని పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే అవినీతి సొమ్మును తిరిగి రాబడతానని చెప్పారు. తల్లి కాంగ్రెస్ కన్నా పిల్ల కాంగ్రెస్‌తోనే భవిష్యత్‌లో ప్రమాదం పొంచి ఉందన్నారు. అవినీతిపై తాను చేస్తున్న పోరాటానికి యువత మద్దతు ఇవ్వాలని, తనతో కలసి నడవాలని కోరారు. పాదయాత్రకు కోరికలతో రాలేదని, లోక కల్యాణం కోసమే వచ్చానన్నారు.
పేపర్ పెట్టను
"జగన్ పత్రిక, టీవీకి కళ్లు లేవు. నా పాదయాత్రకు జనం నుంచి విశేష స్పందన లభిస్తున్నా ఫ్లాప్ అని విషపు రాతలు రాస్తోంది. ఆ పత్రికకు విలువలు లేవు. ఎన్‌టీఆర్, నేను సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పని చేశాం. మేం తలుచుకొంటే పేపర్ పెట్టలేమా?'' అని చంద్రబాబు ప్రశ్నించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్నదే తమ ఆకాంక్ష అని, ఎవరెన్ని చెప్పినా పత్రిక పెట్టనని చంద్రబాబు స్పష్టం చేశారు.
Posted by
arjun
at
8:54 PM