January 10, 2013
జన చైతన్యమే నా లక్ష్యం
భ్రమల్లో ముంచి ఇన్నేళ్లూ దోచుకున్నారు
దోపిడీని ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నాను
చిరంజీవి పార్టీ రాకుంటే 2009లో గెలిచే వాళ్లం
టీఆర్ఎస్‌తో పొత్తు ఉండదు
తెలంగాణపై స్పష్టత ఇచ్చేశాం
తెలుగు జాతికి సేవ చేయడమే లక్ష్యం
తెలుగుదేశం భవిష్యత్తు బ్రహ్మాండం
63 ఏళ్ల వయసులో ఆయనతో ఏమవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ... 1,600 కిలోమీటర్ల
మైలు రాయిని దాటారు. అనేక రాజకీయ సవాళ్ల మధ్య సరికొత్త లక్ష్యంతో 'వస్తున్నా మీకోసం'
అంటూ పాదయాత్ర చేపట్టారు. బుధవారంతో వంద రోజుల పాదయాత్రను పూర్తి చేశారు. ఆయన ఏం చూశారు?
ఏం చేశారు? ఏం చేస్తామంటున్నారు? 'పాదచారి' చంద్రబాబు నాయుడుతో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం
వద్ద 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి' మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన 'ఓపెన్
టాక్' విశేషాలు ఇవి...
నమస్కారం. ఎలా ఉన్నారు ?
చాలా బాగున్నాను.
పాదయాత్ర సాఫీగా సాగుతోందా!?
ఆశయం ముందు ఇబ్బందులు లెక్కలోకి రావు. రాష్ట్రంలో పరిస్థితులు చూసిన తర్వాత
కూడా నా వంతు బాధ్యత నిర్వహించకపోతే... ఓ సీనియర్ నాయకుడిగా విఫలమైనట్లే. కఠిన నిర్ణయమైనప్పటికీ
పాదయాత్రను అందువల్లే ప్రారంభించాను. తర్వాత చాలా ఇబ్బందులొచ్చాయి. రోడ్డుమీద నడుస్తుంటే
షింక్‌బోన్ సమస్య వచ్చింది. గద్వాల వచ్చే సరికి వేదిక కూలిపోయింది. ఆ తర్వాత చిటికెన
వేలు సమస్యతో బాగా నొప్పి కలిగింది. దానిని తప్పించుకోవడం కోసం కుంటుకుంటూ నడిస్తే
కాలు మెలిక పడింది. ఒకదాని తర్వాత ఒకటిగా సమస్యలు. ప్రజల కష్టాలు చూశాక నా కష్టాన్ని
పట్టించుకోలేదు.
మీకు ఇంత అనుభవముంది! పాదయాత్రలు చేస్తే తప్ప (అప్పుడు వైఎస్ విషయంలో
కానీ, ఇప్పుడు మీ విషయంలో కానీ) ప్రజల సమస్యలు తెలియవా?
ఈ పాదయాత్ర ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మాత్రమే కాదు! ప్రజలను చైతన్యవంతులను
చేయడం కూడా ముఖ్యమైన లక్ష్యం. ఈ తొమ్మిదేళ్ళలో ప్రజలను మభ్యపెట్టారు. వ్యవస్థలను పూర్తిగా
భ్రష్టు పట్టించారు. పైగా రాష్ట్రాన్ని వీళ్లే కాపాడుతున్నారన్న అభిప్రాయాలను సృష్టించారు.
ఈ రోజు నా పాదయాత్ర లక్ష్యం ప్రజలను చైతన్యవంతులను చేయడం, వారికి దగ్గర కావడం.
నా లక్ష్యం నెరవేరుతోంది.
ఎలా? జగన్ తింటే తిన్నాడులే... అని జనం అంటున్నారు కదా! దానిపై ప్రజలకు
ఏం చెబుతున్నారు?
ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం, వాస్తవాలు చెప్పడం తప్ప ఇంకో మార్గం లేదు.
ప్రజల్లో అనేక వర్గాల వారున్నారు. టీవీలు చూడని వాళ్లున్నారు. చూసినా వార్తలు పట్టించుకోని
వాళ్లున్నారు. ఇదంతా మాకెందుకు? అనుకునేవాళ్లున్నారు. వీరందరికీ వాస్తవాలు చెప్పే ప్రయత్నం
జరగాలి. లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. దీని ప్రభావం తెలియడంలేదు. రూ.200 పెన్షన్
ఇవ్వడమే గొప్ప అనుకుంటున్నారు. వేరే రాష్ట్రాల్లో ఐదారొందలు కూడా ఇచ్చారు.
రాష్ట్రం వరకు వస్తే మీ పాదయాత్ర ఇప్పటికే రికార్డు సృష్టించింది. దీనిపై
మీకున్న ఫీడ్‌బ్యాక్ ఏమిటి? టీడీపీ చేపట్టిన కార్యక్రమాలను మా కార్యకర్తలకంటే బాగా
ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ఒక్కోసారి ఒక్కో నేపథ్యంలో పనిచేస్తుంటాం. పనులు చేసినప్పుడు
ఇంకా ఎక్కువ చేస్తారని ప్రజలు ఆశించడం సహజం. ఆ ఆశతోనే 2004లో కాంగ్రెస్‌కు ఓటేశారు.
గ్రాండ్ అలయెన్స్ (మహా కూటమి తరహా) అని సీపీఐ నారాయణ అంటున్నారు! వాళ్ల
ఆలోచనలు వాళ్లకుంటాయి. (నవ్వుతూ) ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉంటారు కాబట్టి మమ్మల్ని కూడా
ప్రతిపక్షంలోకి లాగాలనుకుంటారేమో! టీఆర్ఎస్‌తో మళ్లీ కలిసే అవకాశమే లేదా!
అవసరం లేదు. ఒక్కోసారి ఒక్కో ఇబ్బంది వస్తూ ఉంటుంది. కిందటిసారి టీఆర్ఎస్‌తో
పొత్తు పెట్టుకోనట్లైతే మేం అధికారంలోకి వచ్చేవాళ్లం. 2009లో వైఎస్ మళ్లీ గెలవడానికి
కారణం ఆయనేదో చేశారని కాదు. చిరంజీవి పార్టీ పెట్టడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం,
మరోవైపు టీఆర్ఎస్‌తో మేం పొత్తు పెట్టుకోవడం... ఇవన్నీ వైఎస్‌ను గెలిపించాయి. రాజశేఖరరెడ్డి
మొత్తం వ్యవస్థలను నాశనం చేసి, దోపిడీ చేశారు. అసమర్థత, అవినీతి కలిసిపోయాయి. రాష్ట్రం
ఎటుపోతోందో ఎవరికీ అర్థం కావడంలేదు.
మీరన్నది నిజమే! కానీ, ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు నిర్దిష్ట విధానంతో
పని చేస్తామని చెప్పడంలో విఫలమయ్యారు కదా!
రకరకాల పథకాలవల్లే ఇప్పుడు ఆర్థిక సంక్షోభం వచ్చి పన్నులు వేసుకుంటూ వెళుతున్నారు
కదా! నిజానికి... దేశాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య అవినీతి. దీనిని నియంత్రిస్తే
సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. దేశంలో డబ్బు లేక కాదు. ఖర్చుచేసే విధానంలోనే తేడా. ప్రాజెక్టుల
కోసం నేను రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టా. 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కానీ, స్థిరీకరణ
కానీ జరిగింది. వాళ్లేమో రూ.80వేల కోట్లు మురిక్కాలవల్లో పోశా రు. డ్రిప్ ఇరిగేషన్
వంటివాటికి రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటే వీళ్లు చెప్పిన కోటి ఎకరాలకు నీరంది
ఉండేది. జలయజ్ఞం బూడిదలో పోసిన పన్నీరైంది. రాష్ట్రానికి ఒక రాజనీతిజ్ఞుడు (స్టేట్స్‌మన్)
అవసరం కదా!
వాస్తవాలకు దూరంగా పయనించొద్దు. నేనూ స్టేట్స్‌మెన్ అయ్యే దెబ్బతిన్నా.
ఒకేసారి అన్నీ చేసెయ్యాలన్న తపన కూడా సరికాదు. జనంకంటే ముందు పరుగెత్తడం కూడా సరికాదు.
ప్రజలను నడిపిస్తూ నేను వెళ్లాలి. ప్రజల ఆలోచన విధానాన్ని కూడా కలుపుకొని ముందుకెళితేనే
ఆ ప్రయోగం శాశ్వతంగా ఉంటుంది.
వచ్చే ఎన్నికల్లో మీ వైఖరి ఏమిటి?
సామాజిక న్యాయం. ఆర్థిక అసమానతలు తగ్గించడం. మరో ఆర్థిక స్వాతంత్య్రం కోసం
పోరాటం. మీరు అధికారంలో ఉన్నప్పటికి, ఇప్పటికి మధ్య ఒక తరం అంతరం వచ్చింది. మీరేం చేశారన్నది
ఇప్పటి యువతకు తెలుస్తోందా?
ఇటీవలి కాలంలో నేను చెప్పింది కాకుండా, నా పట్టుదల చూసి యువతలో కొంత మార్పు
వచ్చింది. నా పట్టుదలలో 10 శాతం ఉంటే ఇంకా మంచి చదువులు చదువుకునే వాళ్లమని, మంచి భవిష్యత్తు
ఉంటుందనే ఆలోచన వారిలో వస్తోంది.
63 సంవత్సరాల వయస్సులో ఇదేం కర్మ అని ఎప్పుడైనా అనిపించిందా ?
ఎప్పుడూ లేదు. ప్రజల కోసం, ఒక లక్ష్యం కోసం చేస్తున్నప్పుడు ఈ నడకలో కూడా
నాకు ఆనందం, తృప్తి లభిస్తున్నాయి.
లీడర్‌గా ఫర్మ్‌గా ఉండడం అవసరం కదా!
నాకంటే ఫర్మ్‌గా ఎవరున్నారు? ఎవరు చెప్పినా సరే అంటారు కదా. అది ఫర్మ్‌గా
ఉండడమెలా అవుతుంది?
కమిట్‌మెంట్ విషయంలో నిర్ణయం తీసుకున్న తర్వాత మార్పు ఉండదు. నాయకుడు అగ్రెసివ్‌గా
ఉండాలి. హావభావాలు, ఆహార్యంతో ఎన్టీఆర్ విపరీతంగా ఆకట్టుకునే వారు. ట్విట్టర్‌లో మీ
అబ్బాయి చిన్న కామెంట్ చేశారు. అది తొడగొట్టడం. సోనియాను ఎదిరించాడని జగన్‌కు పేరొచ్చింది...
నేను తీసుకున్నన్ని కఠినమైన నిర్ణయాలు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడూ తీసుకోలేదు.
క్రియేటివ్ ఐడియాలూ అంతే. నేను ఎదుర్కొన్నన్ని సంక్షోభాలూ ఎవ రూ ఎదుర్కోలేదు. ఒక్కొక్కరిదీ
ఒక్కో పద్ధతి. ఎన్టీఆర్ ఒకటనుకుంటే ఇక అంతే! నేను కొంత మార్జిన్ ఇస్తా. ఈ విధానంలో
కరెక్ట్ చేసుకోవడానికి అవకాశముంటుంది. కానీ, ఓ లక్ష్యం కోసం ఎంతటి కఠిన నిర్ణయమైనా
తీసుకుంటా. నాటి చైతన్యరథంకంటే నా పాదయాత్ర నిర్ణయం కఠినమైనది.
భవిష్యత్తు ఎలా ఉంటుందని అంచనా వేస్తున్నారు?
కమిట్‌మెంట్‌లో తెలుగుదేశం పార్టీ కానీ, నేను కానీ నంబర్ వన్. టీడీపీ భవిష్యత్తు
వెయ్యి శాతం బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం.
మీరు హామీ ఇస్తున్నారా ?
పార్టీ ఇస్తోంది.
అదే చెబుతున్నా. లీడర్‌గా చెప్పాల్సిన దగ్గర పార్టీ అంటున్నారు. అధికారంలోకి
వస్తే మీరు సీఎం అవుతారా? వేరే ఎవరైనానా?
బ్రాండ్ వాల్యూ కోసం ఆంధ్రజ్యోతి గురించి మీరు ఎలా మాట్లాడతారో, అలాగే
టీడీపీ గురించి నేను మాట్లాడతాను.
శ్రీకాకుళంలో ఎర్రన్నాయుడు సమాధివద్ద పాదయాత్రను ముగించాలన్న ఆలోచన ఉందా?
సాధ్యమైనంత మేరకు ఎక్కువ దూరం నడవాలని, ఎక్కువ మందిని కలవాలన్నది ఆలోచన.
జనవరి 26న ముగించాలనుకున్నాం. తెలంగాణలో ఎక్కువ సమయం పట్టింది. అందువల్ల పాదయాత్రను
కొంచెం కొనసాగించాలని ఆలోచిస్తున్నాం. ఎంతవరకు జరుగుతుందన్నది చూడాలి. తర్వాతి దశలో
పాదయాత్రను లోకేష్ టేకప్ చేస్తాడా?
ఇదంతా మీడియా సృష్టి. ఇంతవరకూ చర్చించలేదు.
మీరూ, వైఎస్ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు ఆయన పిల్లలతో పోటీ
పడాల్సి వచ్చినప్పుడు ఏమనిపిస్తోంది ?
ప్రజాస్వామ్యం గొప్పదనం అదే. వయస్సు, చదువు, అనుభవం ఇవేమీ ప్రజాస్వామ్యంలో
ఉండవు. నా రాజకీయానుభవమంత వయస్సు, చదువు లేనివాళ్లు కూడా నన్ను విమర్శిస్తుంటే నవ్వుకోవడం
తప్ప బాధపడే అవసరముండదు.
మీ పాత సహచరుడు కేసీఆర్ కూడా నడుస్తానంటున్నాడు కదా? మీరిద్దరూ కలవనట్లేనా
?
ఆయన నడిస్తే వేరే వాళ్ల కాళ్లు ఇవ్వాలి. ఇక కలిసే ఉద్దేశమే లేదు. (టీఆర్ఎస్‌తో
పొత్తుపై) నారాయణగారు బలవంతపెడితే నేను వినాలా? మొహమాటాలుండవు.
డిక్లరేషన్ల పేరుతో ఒక్కో వర్గానికి ఒక్కో హామీ ఇచ్చుకుంటూ వెళుతున్నారు.
అవన్నీ జరుగుతాయా?
సమాజంలో ఒక్కో వర్గానిది ఒక్కో ప్రత్యేక సమస్య. దాన్ని ఫోకస్ చేస్తున్నాం.
వాటిని కచ్చితంగా పరిష్కరిస్తాం.
ఈ వంద రోజుల్లో మీ భాషలో, శైలిలో మార్పు వచ్చింది. ట్యూషన్ పెట్టించుకున్నారా?
ఎవరైనా నేర్పిస్తున్నారా?
ప్రజలే నేర్పిస్తున్నారు.
రాజకీయ నాయకులంటే విశ్వసనీయత లేకుండా పోయింది. ఏదో టీవీల కోసమో, ఫొటోల
కోసమో చేస్తారన్న అభిప్రాయముంది. స్వార్థం ముందు... ఆ తర్వాతే నేతలన్న విమర్శలున్నాయి.
ఒక్క రాజకీయమే కాదు... అన్ని వ్యవస్థలూ కొద్దిగా విలువలు కోల్పోయాయి. కానీ రాజకీయాలపై
ఫోకస్ ఎప్పుడూ ఉంటుంది. రాజకీయ నాయకులే భ్రష్టు పట్టినప్పుడు ఇక వ్యవస్థలకూ ఆ గతి పట్టడంలో
ఆశ్చర్యమేముంటుంది ?
జగన్ మోసం చేయగలిగారు. ఆయన మీడి యా, తిరగడం, అతి డబ్బులు కలిసొచ్చాయి.
కానీ అది తాత్కాలికమే. వైఎస్ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మా వాళ్లపై ఎస్సీ, ఎస్టీ
అట్రాసిటీ కేసులు పెట్టారు. కార్యకర్తలను హింసించారు. లొంగిపోవాలి, లేదా ప్రలోభాలకైనా
లొంగాలి. లేదంటే హతమార్చడం... ఇదే ఆయన సిద్ధాంతం.
స్వార్థపరుల్లోనే అస్పష్టత
తెలంగాణ విషయంలో లేఖ ఇచ్చినా ఇంకా స్పష్టత కావాలంటున్నారు ? మీరేమంటారు
?
స్వార్థపరులే ఇంకా స్పష్టత కావాలంటున్నారు. ప్రజలకు, మాకు స్పష్టత ఉంది.
లేఖ ఇచ్చిన తర్వాత, అంతకు ముందు తెలంగాణ ప్రజల వైఖరి, స్పందనలో తేడా ఉందా
?
టీడీపీ బడుగు, బలహీనవర్గాల పార్టీ. మేము గతంలో ఇచ్చిన లేఖను ఉపసంహరించుకోలేదు.
మమ్మల్ని తప్పుబట్టే పరిస్థితి లేదు. స్పందనలో తేడా లేదు.
తెలంగాణ ఆకాంక్ష బలీయంగా ఉందనేది నిర్వివాదాంశం. దీనిని చాలా మంది చాలా
రకాలుగా ఉపయోగించుకున్నారు. లేఖ ఇవ్వడం వల్ల తెలంగాణాలో పార్టీ పుంజుకుందా ?
అంతిమంగా మనోభావాల ప్రకారం పనిచేస్తున్నాం కాబట్టి మాకు సమస్య ఉండదు. ఆంధ్రాలో
ప్రవేశించాక సమస్య ఉంటుందా ?
నిర్ణయం మార్చలేదు. ఆ రోజు లేఖ ఇచ్చాం. టీడీపీ తెలుగువారికి శాశ్వతంగా
అండగా ఉండాలి. ఎన్ని రాష్ట్రాలైనా సరే... తెలుగు జాతికి సేవ చేయాలి.
చిన్న కుటుంబం...
రాజకీయాల్లో ఎంత సక్సెసయ్యారో కానీ, భర్తగా మాత్రం పూర్తిగా విఫలమయ్యారు!
నేను రాజకీయాల్లో ఉండడం వల్ల మొదట నష్టపోయింది మా ఆవిడే. నేనొక లక్ష్యం కోసం వెళ్తున్నానని
ఆమె అర్థం చేసుకుంది.
మధ్యమధ్యలో ఆమె వస్తున్నారు. ఇవన్నీ చూసి బాధపడ్డారా?
చాలాసార్లు బాధపడడం జరిగింది. లక్ష్యం కోసం పనిచేస్తున్నందున కాదని చెప్పలేకపోయింది.
మీ కోడలు బ్రాహ్మణి కూడా వచ్చింది కదా. ఆమె ఏమంటోంది ?
మాది చిన్న కుటుంబం. బయట చూస్తే పెద్ద కుటుంబం. కొడుకు లోకేశ్ బాగా చదువుకున్నాడు.
అందులో నా భార్య పాత్రే ఎక్కువ. ప్రపంచంలోనే ఉత్తమ విశ్వవిద్యాలయంలో చదివాడు. కోడలు
కూడా బాగా చదువుకుంది. కెరీర్ ఓరియెంటెడ్. రాజకీయాలపై ఆధారపడవద్దనేది నా ఉద్దేశం.
మహిళలు కూడా రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని మీ పార్టీ వాళ్లు అనుకుంటున్నారు
కదా. అటువంటి ఆలోచన ఉందా ?
నా భార్యకు రాజకీయాలంటే అనాసక్తి. కోడలు ఎంబీఏ చేసింది. రాజకీయాల్లోకి
వచ్చి కష్టపడాలన్న ఆలోచన లేదు.
లోకేశ్‌కు బాగా ఆసక్తి ఉన్నట్లుంది ?
రాజకీయాల్లోకి రావాలంటే సేవాభావంతో, నిస్వార్థంగా రావాలని లోకేశ్‌కు చెప్పాను.
రాజకీయాల్లో మీ తప్పొప్పులను లోకేశ్ ఎత్తి చూపేందుకు అవకాశం ఇస్తున్నారా?
మొన్నటివరకు అతనికి రాజకీయాలు తెలియవు కదా. నాకు ఏం చెప్పగలుగుతాడు. అయితే
చాలా విషయాలు మాట్లాడుకుంటుంటాం. నగదు బదిలీ ఆలోచన అతనిదే. మంచి చేయాలనుకున్నప్పుడు
ఎవరు చెప్పినా వింటాను.
Posted by
arjun
at
5:49 AM