January 8, 2013
అన్యాయం, అక్రమాలపై నాది ధర్మపోరాటం

వారిది దోచుకోవడం, దాచుకోవడం
కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్‌పై చంద్రబాబు ధ్వజం
ముస్లింలకు ఇస్లామిక్ బ్యాంక్‌తో వడ్డీ లేని రుణాలు
గిరిజనులకు ప్రత్యేక ఏజెన్సీ
యువతులకు పెళ్లి కోసం 50వేల సాయం
వరాలు కురిపించిన టీడీపీ అధ్యక్షుడు
అవినీతికి వ్యతిరేకంగా ధర్మపోరాటం చేస్తున్నానని
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. కాంగ్రెస్, వైసీపీ నేతలు దోచుకోవడం,
దాచుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే లక్ష కోట్ల రూపాయల
ప్రజాధనాన్ని దోపిడి చేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 'వైఎస్ రాజశేఖర్‌రెడ్డి
వేల కోట్ల విలువైన బయ్యారం గనులను అల్లుడికి కట్నంగా కట్టబెట్టారు.
జగన్ జైల్లో నుంచే ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొనుగోలు చేస్తున్నారు.
ఇప్పుడు నైతిక విలువలకు స్థానమే లేకుండా పోయింది. అక్రమాలు, అన్యాయాలకు వ్యతిరేకంగానే
ఈ పాదయాత్ర చేపట్టాను. నా పోరాటం ధర్మపోరాటం' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 'వస్తున్నా
మీకోసం' పాదయాత్రలో భాగంగా సోమవారం వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలంలోని 8 గ్రామాల
గుండా ఆయన నడక సాగించారు.
అవినీతిపరులకు సీఎం అండ
సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు అవినీతి పరులకు అండగా
నిలుస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇంత అసమర్థ, అవినీతి ముఖ్యమంత్రిని గతంలో ఎన్నడూ
చూడలేదన్నారు. అన్ని రకాల ధరలు ఆకాశన్నంటుతున్నా ఆయన పట్టించుకోవడం లేదన్నారు. అస్తవ్యస్త
విద్యుత్ సరఫరాతో రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కిరణ్ సర్కారు అసమర్థ
విధానాలు ప్రజలకు శాపంగా మారాయని విమర్శించారు.
తెలంగాణ సెంటిమెంటుతో ప్రజలను మోసం చేస్తోందని టీఆర్ఎస్‌పై ఆయన ధ్వజమెత్తారు.
'కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు తెలంగాణ పేరుతో ఆర్థికంగా, రాజకీయంగా బలపడ్డారు. అఖిలపక్ష
సమావేశంలో తెలంగాణపై టీడీపీ స్పష్టమైన వైఖరి ప్రకటించేసరికి తమ పీఠం ఎక్కడ కదులుతుందోనని
టీఆర్ఎస్ నేతలు లేనిపోని విమర్శలు చేస్తున్నారు. తెలంగాణకు టీడీపీ ఎప్పుడూ వ్యతిరేకం
కాదు' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
వరాల జల్లు
చంద్రబాబు తన ప్రసంగంలో వివిధ వర్గాల ప్రజలపై వరాల జల్లు కురిపించారు. తమ పార్టీ
అధికారంలోకి వస్తే వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. ముస్లిం
మైనారిటీల ఆర్థిక స్థితిగతులను ప్రస్తావిస్తూ వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.
చిన్న పరిశ్రమలు పెట్టుకునేందుకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి 'ఇస్లామిక్ బ్యాంక్'
పేరుతో ప్రత్యేక బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. లంబాడా గిరిజనుల కోసం ఐటీడీఏ
తరహాలో ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని, గిరిజన యువతులకు పెళ్లి ఖర్చు కింద రూ.50
వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు.
ప్రతి 500 జనాభా ఉన్న ప్రాంతాన్ని గ్రామపంచాయితీగా చేసి నిధులు కేటాయించి అభివృద్ది
చేస్తామన్నారు. నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ శివారు ఆకేరువాగు బ్రిడ్జి నుంచి
బాబు పాదయాత్ర ప్రారంభం అయింది. కొమ్ములవంచ, సబ్‌స్టేషన్ తండా, నర్సింహులపేట, రేకులతండా,
అమర్‌సింగ్ తండా, బంకచంద్రుతండా, వశ్రాం తండా మీదుగా జిల్లాలో పదో రోజు 15 కిమీ పాదయాత్ర
సాగింది.
చిరంజీవి ఫ్లాప్ కాలేదా?
ఎన్నికల ప్రచారంలో సినీ నటులను వినియోగించుకోవాలన్న ఓ నాయకుడి సూచనను చంద్రబాబు
కొట్టిపారేశారు. రాజకీయాల్లో చిరంజీవి ఫ్లాప్ అయిన విషయాన్ని గుర్తు చేశారు. 'కష్టపడితేనే
ఫలితం. సినీ నటులతోనేఏదో లాభం జరుగుతుందనుకోవడం పొరపాటు. అవసరాన్ని బట్టి వారిని వాడుకున్నా..
మనం కష్టపడితేనే ఫలితం ఉంటుంది' అని చెప్పారు.
అతి విశ్వాసం వద్దని, ప్రతీ కార్యకర్త సమన్వయంతో పని చేయాలని ఆయన ఉద్భోదించారు.
నర్సంపేట నియోజకవర్గం సమన్వయ కమిటీ సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Posted by
arjun
at
7:11 AM