May 30, 2013
ఒకే దెబ్బకు మూడు పిట్టలు
టీఆర్‌ఎస్‌కు చెక్
మహానాడులో తెలంగాణ ప్రస్తావన తీసుకురావటం ద్వారా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటిదాకా చేసిన అన్ని సవాళ్ళనూ టీడీపీ ఎదుర్కున్నట్టయింది. చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతి అని ఒకసారి, తెలంగాణకు వ్యతిరేకం కాదంటున్న చంద్రబాబు అనుకూలం అని ఎందుకు చెప్పటం లేదంటూ మరోసారి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తుతూ వచ్చారు. చాలాకాలంగా ఏ సభ జరిగినా కేసీఆర్, ఇతర పార్టీ నేతలు ఏ సభ జరిగినా, కార్యక్రమం జరిగినా దీన్నో పెద్ద ఆయుధంగా ఉపయోగించుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే తాము తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో రెండు ప్రాంతాల నేతలతోనూ చంద్రబాబు చెప్పించారో, అప్పటినుంచి టీఆర్‌ఎస్ విమర్శలు మరో కోణం నుంచి ప్రారంభమయ్యాయి.
వ్యతిరేకం కాదని చెప్పటం తప్ప అనుకూలం అనరెందుకని ప్రశ్నించటం మొదలెట్టారు. తెలంగాణకు ప్రథమ శత్రువులలో కాంగ్రెస్‌తో పాటు తెలుగుదేశం పార్టీని చేర్చాల్సిందే అని స్పష్టం చేస్తూ వచ్చారు. ఈ రెండు పార్టీలను బొంద పెడితే తప్ప తెలంగాణ రాదని పదేపదే చెబుతూ వచ్చారు. ఎప్పుడైతే మహానాడు ప్రారంభం కానున్నట్టు ప్రచారం మొదలైందో టీఆర్‌ఎస్ స్వరం మారిపోయింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్, ఇటీవల బాన్స్‌వాడలో జరిగిన శిక్షణ శిబిరంలో మాట్లాడుతూ దమ్ముంటే మహానాడులో తెలంగాణపై తీర్మానం పెట్టాలని సవాల్ విసిరారు. టీడీపీ దాన్ని స్వీకరించి తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పించటంతో పాటు తమ వైఖరి ఏమాత్రం మారలేదని, కేంద్రానికి ఇచ్చిన లేఖకు, అఖిలపక్షంలో చెప్పిన మాటలకూ కట్టుబడి ఉన్నామ నటం తో టీఆర్‌ఎస్ ఇప్పుడు ఆత్మ రక్షణలో పడిపోయి నట్టయిం దన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగానే మహానా డు ముగిసిన తర్వాత టీఆర్‌ఎస్ స్వరం మారిపో యింది. తెలంగాణపై టీడీపీ అభిప్రాయం అస్పష్టంగా ఉందని, పార్లమెంటులో టీ బిల్లు పెట్టాలని ఎందుకు డిమాండ్ చేయలేదనీ కొత్త వాదాన్ని తెరపైకి తీసుకు వచ్చింది.
పుంజుకునేందుకు అవకాశం
టీఆర్‌ఎస్ వాదనఎలా ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీ బలం తగ్గకుండా వీలైతే మరింత పెంచుకునేందుకు మహానాడు వ్యూహం తోడ్పడుతుందన్న ధీమాతో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. గత సార్వత్రిక ఎన్నికలలో మహాకూటమి ఏర్పాటు చేసి తెలుగుదేశం, టీఆర్‌ఎస్, వామపక్షాలు కలసి పోటీ చేసినప్పుడు కూడా టీఆర్‌ఎస్ కన్న టీడీపీ ఎక్కువ స్థానాలు సాధించింది. మహానాడులో తెలంగాణ ప్రస్తావన తీసుకురావటం ద్వారా తమ బలం ఈసారి అంతకన్న పెరుగుతుందని, టీఆర్‌ఎస్ దూకుడుకు చెక్ పెట్టేందుకు తోడ్పడుతుందని టీడీపీ తెలంగాణ ప్రాంత నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్, వైకాపాకు
ఇక తెలంగాణపై నాన్చుడు ధోరణి అనుసరిస్తున్న కాంగ్రెస్, తమకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్న వైకాపాను దెబ్బ కొట్టేందుకు మహానాడు వ్యూహం కచ్చితంగా ఉపయోగపడుతుందని టీడీపీ నేతలు విశ్వసిస్తున్నారు. తెలంగాణ తెచ్చేదీ, ఇచ్చేదీ తామే అని ఇంతకాలం నుంచి కాంగ్రెస్ పార్టీ జనాన్ని మభ్యపెడుతూ వచ్చిందని, ఈ మాటలను తెలంగాణ కాంగ్రెస్ నేతలే అంటున్నారని, అలాంటప్పుడు తమ మహానాడు వ్యూహం విజయవంతమైనట్టే అని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో ఒకటి తేల్చుకోక తప్పని అనివార్య పరిస్థితిని సృష్టించామని, ఆ రకంగా కాంగ్రెస్‌ను చక్రబంధంలో పడవేసినట్టే అని నేతలు ధీమాగా ఉన్నారు. మరోవైపు వైకాపాను సైతం ఇరకాటంలోకి నెట్టేశామంటున్నారు. ఇప్పటిదాకా ఆ పార్టీ నాయకత్వం తెలంగాణ విషయంలో పొడిపొడి మాటలు మాట్లాడటం, కాంగ్రెస్ నాయకత్వంపై నెపం నెట్టివేయటం మినహా పార్టీ వైఖరి ఏమిటో వెల్లడించని నేపథ్యంలో వైకాపా ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి సృష్టించామని తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు సీనియర్ నేతలు వ్యాఖ్యానించారు.
Posted by
arjun
at
8:59 AM