వచ్చే
సాధారణ ఎన్నికల్లో టిడిపిని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలంతా
సమష్టిగా కృషిచేయాలని రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్ పిలుపునిచ్చారు.
అవినీతి కాంగ్రెస్ పార్టీని గద్దెదించాలని అన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ
సమిష్టిగా కృషి చేయాలన్నారు. శుక్రవారం ఉప్పల్ నియోజకవర్గ టిడిపి మినీ
మహానాడు నాచారంలోని సీకే గార్డెన్స్‌లో జరగ్గా ఆయన హాజరై ప్రసంగించారు.
మంత్రలు అవినీతిలో కూరుకుపోయారని, వారిని తొలగించేందుకు సిఎం
వెనకాడుతున్నారని అన్నారు. అవినీతి మంత్రలును ఎందుకు తొలగించరని ఆయన
ప్రశ్నించారు. ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదన్నారు. టిడిపి
మాత్రమే ప్రజలకు మేలైన పాలన అందించగలదన్నారు. నాలుగేళ్ల యూపీయే2 పాలనలో
అభివృద్ధి పనుల్లో కంటే కుంభకోణాల్లో, ధరల పెరుగుదలలోనే ప్రగతి
కనిపిస్తోందని ఆయన విమర్శించారు. యూపీయే1లో అవినీతికి పునాదులు వేసి
యూపీయే2లో అవినీతి సౌధాలను నిర్మించారనీ, తద్వారా అంతర్జాతీయంగానూ దేశ
ప్రతిష్ఠను దిగజార్చారని ఆరోపించారు. ఆశ్రీత పెట్టుబడిదారీ విధానం
పెరిగింది. పటిష్ఠ లోక్‌పాల్‌ను తీసుకురాలేకపోయారు. అవినీతి ధనాన్ని
రాబడితే ప్రజలపై పన్నులు వేయాల్సిన అవసరం ఉండదన్నారు. దానికి విరుద్ధంగా
అవినీతిని విస్మరించి ధరల్ని, పన్నుల్ని పెంచుతున్నారు. కార్పొరేట్లకు
లక్షల కోట్ల రాయితీలు ఇచ్చి పేదలను విస్మరించారని దుయ్యబట్టారు.
కుంభకోణాల్లో కూరుకుపోయిన యూపీయే2 రాబోయే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని,
యూపీయే, ఎన్డీయేలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలతో
ఆవిర్భవించే తృతీయ ఫ్రంట్‌వైపు ప్రజలు చూస్తున్నారని గౌడ్ పేర్కొన్నారు.ఈ
సమావేశంలో నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై చర్చించారు.