April 8, 2013
కార్యకర్తలతో మమేకం!
వస్తున్నా మీ కోసం పాదయాత్రతో
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు దేశంలోనే అత్యంత దూరం నడిచిన రాజకీయ నేతగా
చంద్రబాబు అరుదైన రికార్డు నెలకొల్పారు. 186 రోజులలో 2,642 కిలోమీటర్ల మేర
నడిచిన చంద్రబాబు గతంలో ఏ నాయకుడూ చేయని కార్యక్రమాలు చేస్తున్నారు.

ఇరవై రోజుల వ్యవధిలో జిల్లాలో అన్ని నియోజకవర్గాల కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు నిర్వహించిన ఘనత కూడా టీడీపీ అధినేతకే దక్కుతుంది. స్వాతం త్య్రం వచ్చాకా మరే రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఈ విధంగా కార్యకర్తల సమావేశా లు నిర్వహించిన దాఖలాలులేవని రాజకీయవేత్తలు చెప్తున్నారు. మార్చి 20వ తేదీన జిల్లాకు చేరుకున్న చంద్రబాబు 18 రోజులలో 18 అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ కార్యకర్తల సమీక్ష సమావేశాలు నిర్వహించారు. తుని మినహా జిల్లాలో అన్ని నియోజవర్గాల కార్యకర్తలతోనూ చంద్రబాబు సమావేశాలు నిర్వహించారు.
రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2, 3 గంటల వరకు ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో పార్టీ స్థానిక నాయకుల ప్రసంగాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వడంలేదు. ముఖ్యమైన అంశాలు చంద్రబాబు మాట్లాడి.. తర్వాత పార్టీ పటిష్టతకు విలువైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి కార్యకర్తలకే అవకాశం ఇస్తున్నారు.
సీరియస్‌గా సమీక్ష
సమీక్ష సమావేశాలు సాదాసీదాగా నిర్వహించడంలేదు. కార్యకర్తలు మాట్లాడేటపుడు సైతం మరే నాయకుడూ మాట్లాడటానికి అవకాశంలేదు. వేదికపై వున్న నేతలపై ఫిర్యాదు చేయడానికీ కార్యకర్తలకు అవకాశం ఇస్తున్నారు. మా నాయకుడు మెతక వైఖరి వల్ల పార్టీ బలోపేతంకావడంలేదని ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జి, ఎమ్మెల్యేలపై వారి సమక్షంలోనే చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చిన దాఖలాలు అనేకం చోటుచేసుకున్నాయి. కొన్ని సమీక్షల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఇతర నేతల మొహమాటాల వల్ల పార్టీ పటిష్టతకు ఇబ్బంది ఏర్పడుతుందని కూడా చంద్రబాబుకు పలువురు కార్యకకర్తలు చెప్పడం గమనార్హం.
సూచనలు రాసుకుంటూ..
కార్యకర్తలు చెప్పే విలువైన సూచనలు, సలహాలు చంద్రబాబు స్వయంగా పుస్తకంలో రాసుకుంటున్నారు. ఆయా కార్యకర్తల ప్రశ్నలకు సావధానంగా సమాధానం ఇస్తున్నారు. సూచనలు చెప్పిన కార్యకర్తలను పేర్లతో సంభోదించి వారు చెప్పిన సలహాపైనా చంద్రబాబు సమీక్ష సమావేశంలో విశ్లేషణ చేస్తున్నారు. పాదయాత్రకు జిల్లాకు వచ్చిన చంద్రబాబు ఈ 18 రోజులలో 18 నియోజకవర్గాల కార్యకర్తల సమావేశాలతోపాటు.. బీసీ, బ్రాహ్మణ, కాపు తదితర సామాజిక వర్గాల నేతలతోనూ, యువత సమావేశాలు నిర్వహించారు. ఒక్కో నియోజకవర్గం నుంచీ 2 నుంచి 3 వేల మంది వరకు కార్యకర్తలు హాజరవుతున్నారు.
టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం
చంద్రబాబు పాదయాత్ర, నియోజకవర్గాల సమీక్షతో టీడీపీ కార్యకర్తలు నూతనోత్సాహంతో కదంతొక్కుతున్నారు. పాదయాత్రలో చంద్రబాబు వెంట నడవడానికి పోటీపడుతున్నారు. స్థానికులేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పాదయాత్రకు హాజరవుతున్నారు. వందలాదిమంది జిల్లా స్థాయి నేతలు చంద్రబాబు వెంట సాగుతున్నారు. ఈ ఉత్సాహం , చంద్రబాబు స్ఫూర్తి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికలలో తమకు తిరుగులేదని తెలుగు తమ్ముళ్లు సంబరపడుతున్నారు.
Posted by
arjun
at
6:09 AM