February 27, 2013
వైఎస్ పాలనంతా అవినీతే
కాంగ్రెస్ అంటేనే కష్టాలు
అవగాహన లేని కిరణ్‌తో అధోగతే
సర్కారు తీరుతో డెల్టా రైతు ఆశలు ఉల్టా
జైల్లో జగన్‌కు దొంగ పూజలు: చంద్రబాబు ధ్వజం
అనంతరం అవనిగడ్డలో జరిగిన బహిరంగ సభలో ఆయన తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనను తూర్పారబట్టారు. "అవినీతి, అసమర్థ, దోపిడీ పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వం నిదర్శనం. ఆ పార్టీ నేతలకు ప్రజా సంక్షేమం ఏ మాత్రం పట్టదు. కనీస అవగాహన లేని కిరికిరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. వైఎస్ సీఎం అయిన తరువాత రాష్ట్రం అవినీతి మయం కాగా, కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో అసమర్థత రాజ్యమేలుతోంది'' అని దుయ్యబట్టారు. 1994కి ముందు లోటు బడ్జెట్, కరెంటు కోత ఉండగా, 2004 నాటికి మిగులు కరెంటు, మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని కాంగ్రెస్‌కు అప్పగించామని గుర్తుచేశారు. తన హయాంలో 420 ఉన్న డీఏపీ బస్తా 1270కు పెరిగిందని చెప్పుకొచ్చారు.
డెల్టా ఆధునికీకరణ పనుల పేరుతో రెండో పంటకు నీళ్లివ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురుపోసుకుంటుందని ధ్వజమెత్తారు. కమీషన్ల కోసం జలయజ్ఞం పథకాన్ని ధనయజ్ఞంగా మార్చిన ఘనత కాంగ్రెస్ నాయకులకే దక్కిందన్నారు. స్వార్థం కోసం కాదు.. ప్రజా సంక్షేమమే ఏకైక లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నానని చెప్పుకొచ్చారు. " తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేశాను. రెండు పర్యాయాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. నా రికార్డు బ్రేక్ చేయాలంటే మరో ఇరవై ఏళ్లయినా పడుతుంది'' అని వివరించారు.
ప్రపంచంలో ఏ దేశంలో లేని యువత మన దేశంలో ఉందని, పాలన సరిగా ఉంటే చైనాను అధిగమించే శక్తి మనకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉండగా, తీవ్రవాదులూ, మత కలహాలురేపేవారూ, రౌడీలూ సరిహద్దులు దాటిపోయారని పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని, అసమర్థ మంత్రుల వైఖరే దీనికి కారణమని దుయ్యబట్టారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే, మచిలీపట్నం - రేపల్లె నడుమ కేరిడార్ ఏర్పాటు చేసి పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని చెప్పారు.
Posted by
arjun
at
10:20 PM