February 27, 2013
అభివృద్ధికి అది 'వారధి'!

వరదల నుంచి ఆ ఊళ్లను కాపాడటమే కాదు.. కూలీనాలీ చేసుకొని బతికే ఆ ప్రజలకు ఒక్క పూట కూడా పూటగడవని పరిస్థితి రాకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను. నేనిప్పుడు ఆ వారధిపైనే నిలబడి ఉన్నాను. గుంటూరు జిల్లాలో యాత్ర ముగించుకొన్న నన్ను కృష్ణా జిల్లాలోకి తోడ్కొనిపోయింది ఈ వారధే. అప్పుడు (1999) ఆరు నెలల కాలంలోనే నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ వంతెనపై అడుగులు వేస్తుంటే కాస్తంత ఉద్వేగానికి గురయ్యాను. అభివృద్ధికి చిహ్నమైన ఈ వారధి ఇప్పుడు మార్పుకూ సంకేతమే!
రేపల్లె నుంచి చాలామంది వారధి దాటి పనుల కోసం అవనిగడ్డకు వచ్చారు. వాళ్లంతా తిరిగి వెళుతూ నాకు ఎదురయ్యారు. ఎవరిని పలకరించినా వారధి కట్టి తమకు చేసిన మేలును పదేపదే ప్రస్తావించారు. వాళ్ల కళ్లలో ఆ సమయంలో గొప్ప సంతృప్తిని చూశాను. కూలి పనులు చేసుకునే తమను డ్వాక్రా సంఘాల్లో చేర్చిన వైనాన్ని వారిలో కొందరు ఆడపడుచులు గుర్తుచేశారు. ఆ సంఘాలు ఇప్పుడేమి చేస్తున్నాయని ఉత్సాహంగా ఆరా తీశాను.
కానీ, ఆ ప్రశ్నకు వాళ్ల ముఖాలు వెలవెలబోయాయి. 'ఏముంది సార్.. అప్పుడు నువ్వు మా ఆకలి చూశావు. ఇప్పుడు వీళ్లు మా అంతం చూస్తున్నారు. చదువుకోలేదని మాలో చాలామందికి బ్యాంకులు అప్పులివ్వడం లేదు. ఇదేమి చోద్యం సార్.. ఈ వయస్సులో మమ్మల్నెక్కడ చదువుకోమంటారు?'' అని ఓ మహిళ అమాయకంగా ముఖం పెట్టింది. రౌతు మెత్తనైతే బ్యాంకులూ బారెడు పొడవున కాళ్లు అడ్డుపెడతాయి మరి!
Posted by
arjun
at
10:23 PM