February 9, 2013
గుంటూరు టు కర్నూలు

రాయపాటి సోదరులు వైకాపాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు రావి వెంకటరమణ, మర్రి రాజశేఖర్, ఆపార్టీకి చెందిన దుగ్గిరాల సొసైటీ అధ్యక్షుడు పాటిబండ్ల హరిప్రసాద్‌తో చర్చించినట్లు తెలిసింది. అధికార పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో స్థానిక వ్యవహారాల్లో అభిప్రాయబేధాలున్న సొసైటీ అధ్యక్షులతో జిల్లా నాయకులు నేరుగా ఫోన్‌లో మంతనాలు జరుపుతున్నారు. మీకు మేం అండగా ఉన్నాం... అన్ని సమస్యలు సర్దుకుంటాయి... పార్టీకి ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్ఠతో కూడినవి... ఈ ఒక్కసారి పార్టీకి మద్దతివ్వాలంటూ జిల్లా నాయకులు కోరుతున్నారు.
తేలని పొత్తులు... అంతర్మథనంలో కాంగ్రెస్, వైకాపాలు... డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల్లో కాంగ్రెస్, వైకాపాల మధ్య పొత్తు ఉంటుందా? లేదా ? అనేది ఇంకా తేలలేదు. తాత్కాలిక భావోద్రేకాలతో వ్యవహరించి డీసీసీబీ, డీసీఎంఎస్‌లను టీడీపీకి అప్పగిస్తే భవిష్యత్తులో ఇబ్బందిపడాల్సి వస్తుందని ఈ రెండు పార్టీల నేతలు అంతర్మథనం చెందుతున్నారు. స్వతంత్ర సంస్థలుగా ఉంటూ ప్రతిఏడాది రూ. 1,200 కోట్ల లావాదేవీలతో రైతులతో సన్నిహిత సంబంధాలుండే ఈ రెండు చైర్మన్ పదవులను టీడీపీకి అప్పగిస్తే ఆ పార్టీ పునాదులు బలపడతాయని కాంగ్రెస్, వైకాపా నేతలు భావిస్తున్నారు. గ్రామ స్థాయిలో అనేక సొసైటీలలో స్థానికంగా ఉండే రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని పొత్తులు సాగాయి. అదేవిధానాన్ని జిల్లా స్థాయిలో అమలుపరిచి డీసీసీబీని కాంగ్రెస్‌కు, డీసీఎంఎస్‌ను వైకాపా తీసుకోవటం మంచిదని రెండు పార్టీలకు చెందిన శ్రేయోభిలాషులు సూచిస్తున్నారు.
డివిజన్ల వారీగా పదవుల పందేరం డీసీసీబీ,డీసీఎంఎస్ పదవులను రెవెన్యూ డివిజన్ల వారీగా ఆయా పార్టీలు పంచుతున్నాయి. టీడీపీ డీసీసీబీ చైర్మన్‌గా తెనాలి డివిజన్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకటసుబ్బయ్యను, పొన్నూరు నియోజకవర్గానికి చెందిన ఇక్కుర్తి సాంబశివరావును వైస్ చైర్మన్‌గా ఎంపిక చేశారు. డీసీఎంఎస్్ చైర్మన్‌గా గుంటూరు డివిజన్‌కు చెందిన మల్లాయపాలెం సొసైటీ అధ్యక్షుడు కుర్రి సుబ్బారెడ్డిని, వైస్ చైర్మన్‌గా బీసీ అభ్యర్థిని ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
* కాంగ్రెస్‌లో డీసీసీబీ చైర్మన్‌గా గుంటూరు డివిజన్‌కు చెందిన రావెల సొసైటీ అధ్యక్షుడు కొమ్మినేని రామచంద్రరావును, డీసీఎంఎస్‌చైర్మన్‌గా వినుకొండ సొసైటీ అధ్యక్షుడు సిహెచ్ కోటిరెడ్డిని ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది.
నరసరావపేట డివిజన్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే కుర్రి పున్నారెడ్డి, జొన్నల గడ్డ సొసైటీ అధ్యక్షుడు నల్లపాటి రామచంద్ర ప్రసాద్ (రాము), డీసీఎంఎస్ చైర్మన్‌గా తెనాలి డివిజన్‌కు చెందిన పెరవలి సొసైటీ అధ్యక్షుడు విష్ణుమొలకల వెంకట రెడ్డయ్యల పేర్లు వినిపిస్తున్నాయి.
* వైకాపా నుంచి డీసీసీబీకి తెనాలి డివిజన్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే గుదిబండ వెంకటరెడ్డి, డీసీఎంఎస్‌కు నరసరావుపేట డివిజన్‌లోని మురికిపూడి సొసైటీ అధ్యక్షుడు సోమేపల్లి వెంకటసుబ్బయ్యల పేర్లు వినిపిస్తున్నాయి.
నేడు టీడీపీ కార్యాలయంలో అధ్యక్షులకు సత్కారం జిల్లా వ్యాప్తంగా టీడీపీ నుంచి సొసైటీ అధ్యక్షులుగా ఎన్నికైన వారిని శనివారం గుంటూరు అరండల్ పేటలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో సత్కరిస్తున్నారు. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఆలపాటికి క్యాంపు బాధ్యతలను అప్పగించారు. సహకార శాఖ అధికారిగా పనిచేసిన పాటిబండ్ల నాగేశ్వరరావు అధ్యక్షులను క్యాంపునకు తరలించే పనుల్లో నిమగ్నమయ్యారు. మాజీ మంత్రి ఆలపాటి, ఎమ్మెల్యే ఆనంద్‌బాబు, డీసీసీబీ అభ్యర్థి ముమ్మనేని తదితరులు సొసైటీ అధ్యక్షులతో పార్టీ కార్యాలయంలో చర్చించారు.
దేశం సొసైటీ అధ్యక్షులను శుక్రవారమే క్యాంపునకు తరలించాలని భావించి ప్రత్యేక బస్సులను తెప్పించారు. పార్టీ అధినేత జిల్లాలో పాదయాత్రలో ఉండటంతో క్యాంపు రెండు రోజులు వాయిదా పడింది. సొసైటీ అధ్యక్షులను ఆదివారం గుంటూరులో చంద్రబాబుకు పరిచయం చేసి క్యాంపునకు తరలించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మ్యాజిక్ ఫిగర్ కోసం బేరసారాలు... డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను ఏ పార్టీ సాధించలేకపోయింది. దీంతో ఇతర పార్టీలకు చెందిన అధ్యక్షులను తమ వైపు తిప్పుకుంటే మంచిదనే భావన క్యాంపు నిర్వాహకులకు ఉంది. దీనికోసం మూడు పార్టీలు రూ. లక్షల్లో డబ్బు ఖర్చు చేస్తున్నాయి. మేం పెట్టిన డబ్బు ఇస్తే చాలు మీకే చేతులెత్తుతాం.. అంటూ కొంత మంది అధ్యక్షులు లోపాయికారిగా వివిధ పార్టీలతో బేరసారాలు సాగిస్తున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన అధ్యక్షులు కూడా డబ్బు తీసుకుని తమ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటామని.... మమ్మల్ని పరిగణనలోకి తీసుకోండని క్యాంపు నిర్వాహకులకు సంకేతాలిస్తున్నారు.
కీలకమైన సామాజిక వర్గం... డీసీసీబీ,డీసీఎంఎస్ ఎన్నికల్లో ఓ సామాజిక వర్గం కీలకమైంది. డీసీసీబీని ఒక ప్రధాన సామాజిక వర్గానికి ఇస్తే డీసీఎంఎస్‌ను మరో సామాజిక వర్గానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న ముగ్గురు మాజీ ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు... వివిధ పార్టీల నుంచి ప్రధాన సామాజిక వర్గానికి చెందిన వారు 90 మంది అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ అంశం కూడా డీసీసీబీ ఎన్నికల్లో కీలకపాత్ర వహించబోతోంది. ఎన్నికలు సమీపించే కొద్దీ అనేక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
Posted by
arjun
at
5:13 AM