February 8, 2013
మేం బతికేదెలా?

హైవే మీద పని చేస్తోన్న కార్మికులు తాము రోజంతా ప్రాణాలను లెక్క చేయకుండా కష్టపడుతున్నా రూ. 100 కూడా చేతికి రావడం లేదని వాపోయారు. చినకాకానిలో పలువురు దర్జీలు తాము కుట్టు శిక్షణ నేర్చుకొన్నామని, ప్రభుత్వం కుట్టుమిషన్లు ఇవ్వకపోవడంతో ఖాళీగా ఉంటున్నామన్నారు. గ్యాస్ సిలిండర్లు కావాలంటే ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. పొదుపు సక్రమంగా పాటిస్తున్నా రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడం లేదన్నారు. ఇళ్లు కట్టుకొన్నా బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారని చెప్పారు. ఊళ్లో కాలువలు లేక పారిశుధ్య సమస్యలు తలెత్తి అనారోగ్యం భారిన పడుతున్నామన్నారు. సంవత్సరానికి రూ. 1.50 కోట్లు పంచాయితీకి పన్నులు రూపంలో తాము చెల్లిస్తున్నా కనీసం తాగడానికి నీరు కూడా ఇవ్వడం లేదని చెప్పారు. బియ్యం, కూరగాయలు, నూనెలు, పప్పుల ధరలు పెరిగిపోయాయని, ఈ పరిస్థితుల్లో తామెలా బతకాలని ఆవేదన వ్యక్తంచేశారు.
చంద్రబాబు ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టాలు ఆలకించి కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయామని ప్రజలు ఇప్పుడు తెలుసుకొంటున్నారని వ్యాఖ్యానించారు. ఒకపక్క రైతులకు గిట్టుబాటు ధర రాకుండా దగా చేస్తూ మరోవైపు వినియోగదారులపై పెనుభారం మోపు తూ నడ్డి విరుస్తోందన్నారు. పనికిమాలిన ప్రభుత్వం మన జీవితాలతో ఆడుకొంటోందని చెప్పారు. అసలు విద్యుత్ సరఫరా చేయకుండా బిల్లులు, సర్‌చార్జ్‌లు వేస్తూ ప్రజల నెత్తిన బాంబులు వేస్తోందన్నారు. తాను వస్తుంటే ప్రజలు ఒక సోదరుడిగా భావిస్తూ మహిళలు వారి కష్టాలు చెప్పుకొంటున్నారని చెప్పారు. మగవాళ్లతో సమానంగా మహిళలను పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకొంటానని, విద్యార్థులు చదువుకొన్న తర్వాత నెలకు కొంతమొత్తం వారికి ఇప్పించే ఏర్పాటు చేస్తానన్నారు.
Posted by
arjun
at
4:54 AM