January 20, 2013
బడి నుంచి మడి దాకా ఒకటే కష్టం!

కొన్ని గ్రామాలకు పొలిమేర వరకు కృష్ణాజలాలు చేరినా పంపిణీ వ్యవస్థ లేక ప్రజల గొంతుక తడవడం లేదు. నా హయాంలో జిల్లాలోని ప్రతి పల్లెకూ కృష్ణా జలాలను అందించాలని, ఫ్లోరైడ్ సమస్యను శాశ్వతంగా నిర్మూలించాలని తపించాను. కొంతమేర సఫలమయ్యాను కూడా. ఆ తరువాత తొమ్మిదేళ్లు గడిచాయి. నా తరువాత వచ్చినవాళ్ల్ల నిర్వాకంతో చిన్నపుండు కాస్తా ఇప్పుడు రాచపుండైంది.
సీత్లాతండా సమీపంలో ఓ పొలంలోకి వెళ్లాను. రెండో పంట కోసం నారుమడి పోశానంటూ పొలమంతా తిప్పి చూపించాడు కోటయ్య. అదంతా ఎండిపోయి కనిపించింది. కృష్ణా ఎడమ కాలువ పాదాల చెంత ఉన్న భూములకూ ఈ గతేమిటో? అదే విషయాన్ని అడిగాను.
" సార్..గత ఏడాది సాగర్ కాలువ లైనింగ్ పనులన్నారు. నీళ్లు ఇవ్వలేదు. ఇప్పుడేమో సాగర్‌లో నీళ్లేం లేవంటున్నారు. ఈసారీ నీళ్లూ లేనట్టేనని చెబుతున్నారు. ఇక కాలువలపై ఆశలు వదులుకొని బోరుబావులపై ఆధారపడదామని చూశాం. కానీ, కరెంటేదీ? బోరు కోసం లక్ష రూపాయల దాకా ఖర్చుచేశాను. మరింకెంత పెట్టాలో?'' అని కోటయ్య వాపోయాడు.
పొలం గట్లమీదగా నడిచి రోడ్డెక్కిన నాకు ఒక ఉపాధ్యాయ బృందం ఎదురుపడింది. పీఆర్సీని వేయించాలని వేడుకుంది. టీచర్ బదిలీలు సైతం పలుకుబడి ఉన్నవారికే జరుగుతున్నాయట. నా హయాంలో కౌన్సెలింగ్ పెట్టి ఒక పద్ధతి లో బదిలీ చేసిన విధానాన్ని వారంతా గుర్తుచేశారు. పలుకుబడి లేదంటే పైసలు ఉంటేనే ఇప్పుడు పనులవుతున్నాయని వాపోయారు. మడి నుంచి బడిదాకా కష్టమొక్కటే కదా!
Posted by
arjun
at
1:55 AM