December 27, 2012
అవినీతి పరులకు వైఎస్ అందలం
వ్యవస్థలను భ్రష్టు పట్టించారుఇల్లులేని రిపుంజయ.. కోట్లకు పడగలెత్తారువైఎస్ పాలనపై చంద్రబాబు ధ్వజంఅవినీతిరహిత పాలన అందిస్తామని హామీ
అవినీతిపరులను, నేర చరితులను అందలమెక్కించి వైఎస్
రాజశేఖర్‌రెడ్డి వ్యవస్థలను భ్రష్టు పట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
ఆయన కొనసాగిస్తున్న 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర గురువారం కరీంనగర్ జిల్లా శానగొండ,
బాయమ్మపల్లి, గూడెం, ఇందుర్తి, గుంపుల గ్రామాల్లో కొనసాగింది. ఏపీపీఎస్సీలో అవినీతిపరులు
ఉండటంతో ప్రతిభావంతులకు ఉద్యోగాలు రాలేదని, డబ్బున్న వారికే దక్కాయని ఆయన ఆవేదన వ్యక్తం
చేశారు. రిపుంజయరెడ్డి అనే సభ్యుడు అవినీతికి పాల్పడి కోట్లు కొల్లగొట్టాడని చంద్రబాబు
ఆరోపించారు.
తన పీఏ సూరీడు రికమండేషన్‌తో రిపుంజయరెడ్డిని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏపీపీఎస్సీ
సభ్యునిగా నియమించగా 2008కి ముందు ఇల్లుకూడా లేని ఆయన.. ఇప్పుడు కోట్లు సంపాదించాడని
విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చి అవినీతి రహిత పాలన అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచడానికి డబ్బు లేదు గానీ, కాంగ్రెస్ దొంగలు దోచుకోవడానికి
లక్షల కోట్లు దొరికాయన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతులు తీసుకున్న అన్ని రుణాలను
మాఫీ చేసే బాధ్యతను తీసుకుంటుందని, 9 గంటల పాటు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇవ్వడంతో
పాటు కరెంట్ చార్జీలను కూడా తగ్గిస్తుందని హామీ ఇచ్చారు. చదువుకున్న వారందరికీ ఉద్యోగాలు,
ఉపాధి లభించేలా చూస్తుందని, అప్పటి వరకు నిరుద్యోగ భృతిని అందిస్తుందన్నారు.
బీసీలకు రూ. 10 వేల కోట్ల ప్రణాళికను అమలుచేసి వారి అభ్యున్నతికి పాటుపడతామని,
వంద అసెంబ్లీ సీట్లను వారికి కేటాయిస్తామని చెప్పారు. పత్తి క్వింటాలుకు రూ. 5 వేల
ధర వచ్చేలా చూస్తామని చెప్పారు. ఆడబిడ్డలను మగవారితో సమానంగా అన్ని రంగాలలో అభివృద్ధి
చేస్తామన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది టీడీపీయేనని చంద్రబాబు
చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా తాను ఎన్నడూ మాట్లాడలేదని, భవిష్యత్తులో కూడా మాట్లాడేది
లేదని స్పష్టం చేశారు.
సమస్యలు తెలుసుకుంటూ..
చంద్రబాబు తన పాదయాత్రలో అడుగడుగునా ఆగుతూ దారిలో కలిసిన వారి సమస్యలు
తెలుసుకుంటూ ముందుకు సాగారు. శానగొండలో 50 మంది గీత కార్మికులు చంద్రబాబుకు స్వాగతం
పలకగా వారి వద్దకు వెళ్లి మోకు ధరించి గీత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ
ఇచ్చారు. అక్కడే పంచాయతీ సిబ్బందిని తమకు కనీస వేతనాలు కావాలని, పదో తరగతి చదువుకున్న
కార్మికులకు ప్రమోషన్ ఇవ్వాలని కోరగా.. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని
చెప్పారు.
గ్రహణంమొర్రితో ఉన్న గాజుల వర్షిణి అనే అమ్మాయి తనకు ఒకసారి శస్త్రచికిత్స
అయ్యిందని, మరో ఐదుసార్లు చేయాల్సి ఉందని తన ఆర్థిక స్థితిని విన్నవించగా ఆమెకు ఆపరేషన్
చేయించి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. రోడ్డు పక్కన ఉన్న హోటల్‌లోకి వెళ్లి మిర్చి
బజ్జీలు వేస్తున్న పూసాల రజితతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
తాను కూడా బజ్జీలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. చంద్రబాబు మిర్చి తినగా...
తెలంగాణ కారం ఎలా ఉందంటూ రజిత ప్రశ్నించింది. 30 ఏళ్లుగా ఇక్కడే ఉంటూ ఇదే కారం తింటున్నానని
ఆయన జవాబిచ్చి అందరినీ నవ్వించారు. పొలిట్‌బ్యూరో సమావేశం కారణంగా పాదయాత్ర సాయంత్రం
ఐదు గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు మాత్రమే సాగింది.
Posted by
arjun
at
8:37 PM