September 23, 2013
సోనియాగాంధీని దయ్యంగా అభివర్ణించిన వైఎస్సార్ కాంగ్రెస్‌కు... జగన్‌కు బెయిల్ వచ్చిన తర్వాత ఆమె దేవతగా మారింది
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్
పార్టీ కుమ్మక్కయిందని తాను ముందే చెప్పానని, జగన్‌కు బెయిల్ రావడం ఇందులో
భాగమేనని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రపతికి ఇచ్చిన
వినతిపత్రంలోనే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జగన్, టిఆర్ఎస్‌లతో
కాంగ్రెస్ కుమ్మక్కయిందని తాను వివరించానని ఆయన చెప్పారు. కాంగ్రెస్
అవినీతి రాజకీయాలపై ఇక ఉధృతంగా పోరాడతామని, జగన్‌కు బెయిల్ ఇవ్వడంపై
న్యాయస్థానాల్లోనేగాక, ప్రజాకోర్టుల్లోనూ పోరాటం చేస్తామని ఆయన అన్నారు.
కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్‌లను దోషులుగా నిలబెడతామని చంద్రబాబు
చెప్పారు. సోనియాగాంధీని దయ్యంగా అభివర్ణించిన వైఎస్సార్ కాంగ్రెస్‌కు...
జగన్‌కు బెయిల్ వచ్చిన తర్వాత ఆమె దేవతగా మారిందని ఆయన అన్నారు.
ప్రజలు ఈ రాజకీయాలను ఏవగించుకుని తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారని ఆయన
విశ్వాసం వ్యక్తం చేశారు. అనేక కుంభకోణాలకు, అవినీతి కార్యకలాపాలకు
పాల్పడుతున్న కాంగ్రెస్... దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో ముంచిందని,
ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పడిపోయిందని, దేశం ప్రతిష్ట అంతర్జాతీయంగా
దిగజారిందని ఆయన అన్నారు. ఇప్పుడు జగన్‌తో కుమ్మక్కయిందని, ఈ పరిణామాలపై
దేశవ్యాప్తంగా చర్చ లేవదీస్తామని చెప్పారు. అవినీతి కుంభకోణాలపై పోరాడిన
చరిత్ర తెలుగుదేశం పార్టీదని, గతంలో బోఫోర్స్ కుంభకోణంపై, రాజశేఖర్‌రెడ్డి
అవినీతిపై పోరాడామని ఆయన గుర్తు చేశారు. ఒక కుటుంబాన్ని ఆ«ధికారంలోకి తేవడం
కోసం కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్
పార్టీ దేశాన్ని నాశనం చేసిందని, తెలుగు ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని ఆయన
ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడిందన్న చంద్రబాబు... సీడబ్ల్యూసీ తీర్మానాన్ని ప్రకటించిన రోజే టిఆర్ఎస్ విలీనం అవుతుందని దిగ్విజయ్ సింగ్ ప్రకటించారని, జగన్ డీఎన్ఏ కాంగ్రెస్ డీఎన్ఏ ఒకటేనని ఆయనే చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణపై నిర్ణయం తీసుకుంటారన్న విషయం వారం రోజుల క్రితమే జగన్ పార్టీకి తెలుసునని, అందుకే వారి ఎమ్మెల్యేలు ముందే రాజీనామా చేశారని చంద్రబాబు అన్నారు. తాజాగా వైఎస్సార్‌కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల నేతల భార్యలు రాష్ట్రపతికి ఒకే వినతిపత్రం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సీబీఐ పది ఛార్జిషీటుల్లో 73 మందిపై కేసులు మోపిందని, వీటన్నింటిలోనూ జగన్ ఏ-1 నిందితుడుగా ఉన్నాడని ఆయన గుర్తు చేశారు. ఏ-2, ఏ-3, ఏ-4, ఏ-5 నిందితులకు బెయిల్ రాకుండా జగన్‌కు బెయిల్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.
మరో రెండు ఛార్జిషీట్లు దాఖలు చేయకుమందే జగన్ బెయిల్‌కు దరఖాస్తు పెట్టుకున్నారని, ఆ తర్వాత ఈ ఛార్జిషీట్లు దాఖలు చేశారని చంద్రబాబు అన్నారు. నిజానికి ఛార్జిషీట్లు అన్నీ దాఖలు చేసిన తర్వాత బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని సుప్రీం కోర్టు చెప్పిందని తెలిపారు. మధుకోడా నాలుగున్నరేళ్లుగా జైలులో ఉన్నారని, ఆయన ఆస్తులను అటాచ్ చేశారని, గాలి జనార్దన్‌రెడ్డి రెండేళ్లుగా జైలులో ఉన్నారని చెప్పారు. సత్యం రామలింగరాజు వ్యక్తిగత ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారని అన్నారు. వీరిపై ఉన్న కేసుల కంటే జగన్ పై ఉన్న కేసుల తీవ్రత ఎంతో ఎక్కువని చంద్రబాబు అన్నారు. గాలిపై ఒక్క ఇనుపఖనిజం కేసు ఉంటే... జగన్‌పై మనీలాండరింగ్, వాన్‌పిక్, అక్రమ కేటాయింపుల వంటి అనేక కేసులున్నాయన్నారు. ఒక పకడ్బందీ వ్యూహం ప్రకారం అంతా కూడబలుక్కున్నట్లే జరిగిందని ఆయన అన్నారు.
ఏడు కేసుల్లో క్విడ్ ప్రో కో లేదని తేలిందని, తమ విచారణ పూర్తయిందని, ఇతర అంశాలపై ఐటీ, ఈడీలకు లేఖ రాశామని సీబీఐ కోర్టుకు చెప్పడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం చేశారు. ఇదే సీబీఐ జగన్‌పై విచారణ సాగుతున్నదని, విదేశాలకు కూడా లేఖలు రాశామని వివరించి, బెయిల్‌ను తీవ్రంగా వ్యతిరేకించిందని చంద్రబాబు తెలిపారు. ఈ రీత్యా జగన్‌కు బెయిల్ ఇవ్వాలనడం సాంకేతికంగానే చెల్లదని ఆయన అన్నారు. ఇంకా విచారణ జరగాల్సి ఉన్నదని కోర్టుకు సీబీఐ చెప్పలేకపోయిందని అయన అన్నారు. కొద్దినెలల ముందు సీబీఐ జేడీని, డీఐజీని బదిలీ చేశారని, కోర్టు ముందు ఇంతకుముందున్న అడ్వకేట్‌ను పెట్టుకోలేదని ఆయన అన్నారు. సీబీఐ... కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా వ్యవహరిస్తున్నదని, కాంగ్రెస్‌కు, జగన్‌కు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని దీనితో ధ్రువపడుతున్నదని, ఇది చాలా దారుణమని చంద్రబాబు అన్నారు.
ఇటీవల ములాయం సింగ్‌పై సీబీఐ ఆదాయానికి మించిన ఆస్తుల కేసును మూసివేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. సీమాంధ్రలో విద్వేషాలు పెంచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్‌కు వీలు కల్పిస్తున్నారని ఆయన చెప్పారు. ఈడీకి కేసులను నివేదించామని సీబీఐ చెబుతోందని, 16 నెలల నుంచి అసలు ఇంతవరకూ ఈడీ ఏ చర్య తీసుకున్నదని ఆయన ప్రశ్నించారు. కోల్‌కటాకు చెందిన ఒక సూట్‌కేస్ కంపెనీ, గౌహతికి చెందిన ఒక సూట్‌కేస్ కంపెనీల ద్వారా జరిగిన మనీ లాండరింగ్‌పై ఏం చేశారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇంత బరితెగించి అడ్డగోలుగా ఏం చేసినా మనను అడిగేవారేలేరన్నట్లు ప్రవర్తించడం దారుణమని అన్నారు.
Posted by
arjun
at
7:54 PM