
కొమరవోలు పంచాయతీలో పోటీ రసవత్తరం (కృష్ణా కెఎన్‌ఎన్ బ్యూరో) సినీహీరో నందమూరి బాలకృష్ణ మేనమామ కుమారుడి భార్య వరుసకు చెల్లెలు పొట్లూరి క్రిష్ణ కుమారి శనివారం కొమరవోలు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికోసం నామినేషన్ వేశారు. దీంతో ఆ పంచాయతీలో పోటీ రసవత్తరంగా మారింది. తెలుగుదేశం పార్టీ తరపున అంటే ఆ పార్టీ మద్దతుతో పోటీచేశారు. పార్టీలు నేరుగా ఈ ఎన్నికల్లో పాల్గొనక పోయినా, పరోక్షంగా పార్టీలే ఎన్నికల్లో తలపడతాయన్న విషయం తెలిసిందే. అయితే పామర్రు మండల పరిధిలోని కొమరఓలు గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ గ్రామం స్వర్గీయ ఎన్‌టిరామారావు అత్తవారి ఊరు అది. బాలక్రిష్ణ అమ్మమ్మ వారి సొంత గ్రామం నుంచి పొట్లూరి క్రిష్ణకుమారి పోటీచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఈ పంచాయతీ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. బాలయ్య బంధువు రంగంలో ఉండడంతో టిడిపి ఆ పంచాయతీ గెలుపుపై ప్రత్యేక దృష్టి సారించాల్సి వస్తోంది. బాలయ్య కూడా ఏదో ఒక సమయంలో ఆ గ్రామాన్ని ఈ ఎన్నికల లోపు సందర్శించే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.