May 10, 2013
నల్లడబ్బును అడ్డుకోండి దాంతో ఓటర్లను కొంటున్నారు
వెయ్యి, ఐదొందల నోట్లను నిషేధించాలి
ప్రింటర్ - ఈవీఎంలపై అఖిలపక్షంలో చంద్రబాబు
మళ్లీ బ్యాలెట్ పేపర్లు తేవాలన్న సీపీఐ
వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్లను నిషేధించాలన్నారు. ఇక నగదు రూపంలో కాకుండా ఎలక్ట్రానిక్ కార్డుల రూపంలోనే ఆర్థిక లావాదేవీలు జరగాలని చంద్రబాబు సూచించారు. ఎన్నికల్లో మద్యం ఏరులై పారుతోందని, పెయిడ్‌న్యూస్‌ను కూడా కట్టడి చేయాలని తెలిపారు. అందరికీ బ్యాంకు ఖాతాలు తెరిచి, లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారానే జరిగేలా సంస్కరణలు తీసుకురావాలని, అవినీతి రహిత భారతదేశం, నల్లధనం లేని సమాజం ఏర్పాటుకు టీడీపీ నిర్విరామంగా కృషిచేస్తుందన్నారు.
ప్రతి ఒక్కరి ఆదాయ వ్యయాల వివరాలను ట్రాక్ చేసేందుకు వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రం ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకం వల్ల కొంత అవినీతి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అన్నారు. నల్లధనం, ఆర్థిక నేరాలను అరికట్టేందుకు సుప్రీంకోర్టు అనేక చర్యలు తీసుకుంటున్నా అవి సరిపోవని, పార్టీలు కూడా ఆర్థిక సంస్కరణలపై దృష్టి పెట్టాలన్నారు.
వచ్చే ఎన్నికల్లోనే ప్రింటర్ ఈవీఎంలను ప్రవేశపెట్టాలి
ప్రింటర్ ఈవీఎంలకు టీడీపీ సానుకూలంగా ఉందని చంద్రబాబు అన్నారు. ఈసీ కొత్తగా ఏర్పాటు చేసిన ప్రింటర్ ఈవీఎంలు చాలా బాగున్నాయని, అందులో కొన్ని చిన్న చిన్న మార్పులను మాత్రమే తాము సూచించామని అన్నారు. తాను వేసిన ఓటు ఎవరికి పడిందో ఓటరు నిర్ధారించుకోగలిగితేనే ప్రజాస్వామ్యంపై నమ్మకం కలుగుతుందని ఆయన చెప్పారు. ఓటుకు రసీదు ఉంటే వివాదాలను తేలిగ్గా పరిష్కరించవచ్చని అన్నారు.
అన్ని పోలింగ్ కేంద్రాలను వెబ్ కెమెరాలతో అనుసంధానం చేయాలని కూడా తాను సూచించినట్లు తెలిపారు. రానున్న కాలంలో ఆధార్‌కార్డు ఆధారంగా ఓటరును గుర్తించడమే కాకుండా ఐరిస్ పరిజ్ఞానంతో ఎవరి ఓటును వారే వేసుకోగలిగే విధానాన్ని అభివృద్ధి చేయాలని కూడా సూచించినట్లు చంద్రబాబు చెప్పారు. ప్రింటయిన ఓటు కేవలం ఐదు సెకన్లు మాత్రమే కనిపిస్తుందని, ఈ సమయాన్ని పది సెకన్లకు పెంచాలని, రెండు డిస్‌ప్లేలకు బదులుగా ఒక డిస్‌ప్లేనే ఉంచాలని కూడా సూచించినట్లు తెలిపారు.
కాగా.. ప్రింటర్ ఈవీఎం విధానాన్ని కాంగ్రెస్ సహా పలు పార్టీలు స్వాగతించాయి. పలు దేశాలు ఈవీఎంలను వదిలిపెడుతున్నందున మన దేశంలోనూ వాటిని వదిలిపెట్టి, బ్యాలెట్ పేపర్లను ప్రవేశపెట్టాలని సీపీఐ జాతీయసమితి కార్యదర్శి అతుల్‌కుమార్ అంజాన్ కోరారు. అయితే, దీనివల్ల కౌంటింగ్ ఆలస్యమవుతుందని, ఈవీఎంలే మేలని ఈసీ ప్రతినిధులు అన్నారు. బీజేపీ, సమాజ్‌వాదీ, సీపీఐ, జేడీఎస్, బీఎస్పీ తదితర పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Posted by
arjun
at
10:34 PM