
నర్సీపట్నం/చోడవరం: ' నేను
పాదయాత్ర ప్రారంభించి 200 రోజులు దాటిపోయింది. ఈ సందర్భంగా ఎన్నో అంశాలపై
పార్టీ పరంగా స్పష్టమైన వివరణ ఇస్తున్నాను. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో
విడమరిచి చెబుతున్నాను. కానీ సరిగా అర్థం చేసుకోవడంలో మీరు వెనుకబడ్డారు''
అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం బలిఘట్టంలో జరిగిన
చోడవరం, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో స్థానికురాలైన
రొంగలి పద్మావతి లేచి... 'నేను ఇంత వరకు ఇటువంటి సభల్లో మాట్లాడలేదు.
మిమ్మల్ని(చంద్రబాబు) చూసి మీతో మాట్లాడాలని వచ్చాను. కొన్ని సమస్యలను మీకు
తెలపాలని అనుకుంటున్నాను'' అని చెప్పారు. దీంతో చంద్రబాబు స్పందించి ఆమెకు
మైకు ఇవ్వాలని సూచించారు.
'కాంగ్రెస్ ప్రభుత్వం పావలా వడ్డీకే
డ్వాక్రా రుణాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు రూపాయి వడ్డీ వసూలు చేస్తున్నది.
బీమా సొమ్ము కట్టాలని బలవంతం చేస్తున్నారు. కట్టనివారిని ఇబ్బందులకు
గురిచేస్తున్నారు. గ్రామాల్లో మద్యం బెల్టు షాపులు ఎక్కువగా ఉన్నాయి. నా
తల్లికి పింఛను రద్దు చేశారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
మాది పేద కుటుంబం. అయినా కుమారుడిని ఇంజనీరింగ్ చదివించాను. కానీ ఉద్యోగం
దొరకడం లేదు'' అని పద్మావతి గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో తీవ్రంగా
స్పందించిన చంద్రబాబు, ఆమె వ్యక్తం చేసిన వాటికి ఏం సమాధానం చెబుతారని
కార్యకర్తలను ప్రశ్నించారు. దీనిపై ఒకరిద్దరు కార్యకర్తలు మాట్లాడినప్పటికీ
ఆమె వెలిబుచ్చిన సమస్యలకు సమాధానాలు చెప్పలేకపోవడంతో బాబు ఒకింత అసంతప్తి
వ్యక్తం చేశారు.
పాదయాత్రలో తాను చెబుతున్న విషయాలను ప్రజలకు
వివరించడంలో వెనుకబడి వున్నారని అసంతప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తలు
మరింత చైతన్యం కావలసిన అవసరం ఉంద
ని అన్నారు. అనంతరం పద్మావతి వెలిబుచ్చిన
అంశాలపై తీసుకునే చర్యల గురించి వివరించారు. పావలా వడ్డీ రుణాల పేరుతో
జరుగుతున్న మోసాన్ని అరికడతానని, వడ్డీ చెల్లించవద్దని ఇప్పటికే చెప్పానని
అన్నారు. నిరుపేద మహిళలందరికీ నెలకు వెయ్యి రూపాయల పింఛను ఇస్తానని,
గ్రామాల్లో నిరుపేద మహిళల కోసం వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తానని,
అధికారంలోకి వచ్చిన వెంటనే రుణాలు మాఫీ చేయిస్తానని, బెల్టుషాపులను
ఎత్తివేయిస్తానని, నిత్యావసరాల ధరలు అందుబాటులో వుండేలా చూస్తానని హామీ
ఇచ్చారు.