
అనపర్తి : తెలుగుదేశం పార్టీ
అధినేత నారా చంద్రబాబు నాయుడు 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర సోమవారం
అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు అనపర్తి మండలం పెడపర్తిరేవుకు చేరుకుంది. ఈ
సందర్బంగా పార్టీ సీనియర్ నాయకుడు, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి
మూలారెడ్డి, అనపర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
(రాము) ఆధ్వర్యంలో బాబుకు ఘన స్వాగతం పలికారు. అర్ధరాత్రి దాటినా బాబు రాక
కోసం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మహిళలు, అధిక సంఖ్యలో ప్రజలు ఎదురు
చూశారు. పెడపర్తి రేవుకు చేరుకున్న బాబుకు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం
పలికారు. అనపర్తి మాజీ ఎంపీపీ కొవ్వూరి పార్వతి ఆధ్వర్యంలో 150 మంది మహిళలు
బాబుకు హారతులు ఇచ్చారు.
సోమవారం 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి
అర్ధరాత్రి దాటినప్పటికీ బాబు చిరునవ్వుతో అభిమానులకు అభివాదం చేశారు.
అలసి వచ్చిన బాబుకు అంతరంగిక సి బ్బంది దిష్టి తీశారు. రాత్రి రెండు గంటల
ప్రాంతంలో బాబు ప్రజలకు అభివాదం చేసి విశ్రాంతి తీసుకునేందుకు బస్సులోకి
వెళ్ళారు. కార్యక్రమంలో టీడీపీ అనపర్తి మండల నాయకులు కర్రి ధర్మారెడ్డి,
సిరసపల్లి నాగేశ్వరరావు, కర్రి వెంకట రామారెడ్డి, సత్తి దేవదాన్‌రెడ్డి,
తేనెల శ్రీనివాస్, వైజాగ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.