March 27, 2013
రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన ప్రభుత్వం
విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలి
వామపక్షాలతో కలిసి పోరాటానికి సిద్ధం : చంద్రబాబు

తూర్పుగోదావరి జిల్లాలో 'వస్తున్నా..మీకోసం' పాదయాత్ర నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు రాయవరంలో మీడియాతో మాట్లాడుతూ అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం ఈ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శమని ఆయన విమర్శించారు. టీడీపీ హయాంలో వ్యవసాయానికి తొమ్మిది గంటలు కరెంట్ సరఫరా చేశామని, ఈ ప్రభుత్వ హయాంలో కరెంట్ ఇప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని చంద్రబాబు ధ్వజమెత్తారు.
గ్రామాల్లో రోజంతా కరెంట్ ఉండడంలేదని, విద్యుత్ సమస్యతో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు. విద్యుత్‌పై వాస్తవాలు చెబుతూ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వర్షాలు కురిస్తే కరెంట్ ఇస్తామంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే గ్యాస్ ఎగుమతి అవుతోందని, విద్యుత్ వ్యవస్థకు సంబంధించి సీఎం వద్ద ప్రణాళిక లేదని ఆయన ఆరోపించారు.
ఈ ప్రభుత్వం ఇష్టానుసారంగా ధరలు పెంచిందని, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. కేంద్రం నుంచి అదనంగా గ్యాస్ తీసుకురావడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ తీరును పిచ్చి తుగ్లక్ పాలనగా చంద్రబాబు అభివర్ణించారు. విద్యుత్ సమస్యపై వామపక్షాలతో కలిసి టీడీపీ పోరాటం చేస్తుందని, వైఎస్సార్‌సీపీతో కలిసి పోరాడే సమస్యేలేదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
కాగా విద్యుత్ సమస్యలపై టీడీపీ పోరుబాట కొనసాగుతోంది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో 26 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరవధిక దీక్ష బుధవారం నాటికి రెండోరోజుకు చేరుకుంది. సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి టీడీపీ ఎమ్మెల్యేల దీక్షకు మద్దతు ప్రకటించారు.
దీక్ష చేస్తున్న నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
అంతకుముందు విద్యుత్ సమస్యలపై ఓల్ట్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిరవధిక దీక్ష చేపట్టిన 26 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో తూ.గో జిల్లాలో పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దీక్షలకు సంఘీభావంగా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని నేతలకు బాబు పిలుపునిచ్చారు. విద్యుత్ బిల్లులను దగ్ధం చేసి నిరసన తెలపాలని సూచించారు.
Posted by
arjun
at
5:44 AM